ఒకే కాన్పులో పదిమంది.. అంతా కట్టుకథ

South African Tembisa Woman 10 Babies Story Fake Admitted In Psychiatric Ward - Sakshi

ఒకే కాన్పులో పదిమంది పిల్లలకు జన్మనిచ్చానని ప్రకటించుకున్న తల్లి వ్యవహారంలో ఊహించిందే జరిగింది. అనుమానాల్ని పటాపంచల్‌ చేస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అధికారికంగా ఒక నివేదికను వెల్లడించింది. ఆమె, ఆమె భర్త చెప్పింది పచ్చి అబద్ధమని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గోసియామె తమార సిత్‌హోల్‌(37) అల్లింది కట్టుకథేనని ప్రకటిస్తూ.. ఆమెను మానసిక చికిత్స కోసం ఆస్పత్రికి  తరలించినట్లు వెల్లడించింది. 

ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో ఒకే కాన్పులో పది మంది బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిందన్న ఉదంతం సరికొత్త మలుపు తిరిగింది. అసలు సిత్‌హోల్‌ ఈమధ్య కాలంలో గర్భమే దాల్చలేదని అదిరిపోయే ట్విస్ట్‌ వెలుగు చూసింది. ఈ మేరకు ఆమెను పరీక్షించిన వైద్యుల నివేదికను టెంబిసా అధికారులు మీడియాకు రిలీజ్‌ చేశారు. అంతేకాదు ఆమె మానసిక ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మెంటల్‌ హెల్త్ యాక్ట్‌ కింద ఆమెను అదుపులోకి తీసుకుని ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తున్నారు. మరోవైపు ఆమె భర్త టెబెహో సోటెట్సిను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

అతని అతితోనే..
జూన్‌ 7న టెంబిసా పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గోసియామె తమార సిత్‌హోల్‌ ఒకే కాన్పులో పది మంది పిల్లలకు జన్మనిచ్చిందన్నది వార్త. ప్రిటోరియా న్యూస్‌ ఎడిటర్‌  పెయిట్‌ ర్యామ్‌పెడి అత్యుత్సాహం వల్లే ఈ కథనం ప్రపంచం మొత్తం వైరల్‌ అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆ పిల్లల ఫొటోలు, వీడియోలు వైరల్‌ కాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు తమ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని సిత్‌హోల్‌, టెబెహో విరాళాలు సేకరించారు. ఒకానొక టైంలో తన భార్యా పిల్లల ఆచూకీ తనకూ తెలియడం లేదని, అప్పటిదాకా విరాళాలు ఇవ్వడం ఆపండని టెబెహో రిక్వెస్ట్‌ చేశాడు. మరోవైపు గతంలోనూ ముగ్గురు పిల్లలు పుట్టారని సిత్‌హోల్‌ ప్రకటించుకుందని, కానీ, అందులో నిజం లేదని బంధువులు చెప్పారు. ఒకానొక టైంలో ఆ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

అనుమానాలు-విమర్శల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. టెంబిసాలో ఏ ఆస్పత్రిలో ఆమె డెలివరీ కోసం చేరలేదని నిర్ధారించుకుని.. ఆపై ఆమె కట్టుకథను ఆధారాలతో సహా బయటపెట్టారు అధికారులు. ఇక ఇదంతా ఫేక్‌ అని తేలడంతో.. మాలి దేశంలో మే నెలలో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన హలీమా సిస్సే రికార్డు పదిలంగా ఉందని చెప్పొచ్చు. 

చదవండి: 7 నెలల 7 రోజులకే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top