ఆఫ్రికన్‌ బ్రహ్మానందం.. ఒసితా ఇహెమ్‌ | Special Story On Greatest Meme Master Osita Iheme | Sakshi
Sakshi News home page

ఆఫ్రికన్‌ బ్రహ్మానందం.. ఒసితా ఇహెమ్‌

Jan 20 2021 12:00 AM | Updated on Jan 20 2021 12:36 PM

Special Story On Greatest Meme Master Osita Iheme - Sakshi

అచ్చం మన బ్రహ్మిలా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ కడుపుబ్బా నవ్వించే ఆఫ్రికన్‌ యాక్టర్‌ ‘ఒసితా ఇహెమ్‌’. సందర్భానికి తగ్గట్టు ఏ ఎక్స్‌ప్రెషన్‌ కావాలన్నా ఒసితా దగ్గర దొరుకుతుంది. కొందరు తమలో ఉన్న క్రియేటివిటీని మీమ్స్‌ ద్వారా వ్యక్తపరుస్తుంటారు. అలాంటి మీమ్స్‌లో చిన్నపిల్లాడి క్యారెక్టర్‌లో కనిపిస్తూ నవ్వులు పూయిస్తుంటారు ఒసితా. ట్విట్టర్,ఫేస్‌బుక్‌ వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో ఎక్కడ చూసినా ఒసితా ఫొటోలు, జీఐఎఫ్, మీమ్స్‌ కనిపిస్తాయి. 

1982 ఫిబ్రవరి 20న నైజీరియాలోని ఇమొ రాష్ట్రంలో ఒసితా ఇహెమ్‌ జన్మించారు. జన్యులోపం కారణంగా 38 ఏళ్ల ఒసితా చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు. తన మరుగుజ్జు ఆకారాన్ని చూసి ఒసితా ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. తనకెంతో ఇష్టమైన సినీ రంగంలో మంచి కమెడియన్‌గా రాణిస్తున్నాడు. 2002లో నాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒసితా 2003లో ‘అకీ నా ఉక్వా’ అనే నైజీరియన్‌ సినిమాలో పావ్‌పావ్‌ అనే బాలుడి పాత్ర లో తన నటనతో జీవించేశాడు. ఈ క్యారెక్టర్‌ నైజీరియన్లతోపాటు ప్రపంచ దేశాలను మెప్పించింది. అప్పటినుంచి ఒసితాపేరు ‘పావ్‌పావ్‌’అని ప్రముఖంగా వినిపించేది.

వందకుపైగా సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. 2007లో ఒసితా నటనను గుర్తించిన ఆఫ్రికన్‌ మూవీ అకాడమీ ‘లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు’తో సత్కరించింది. కమెడియన్‌గా, నిర్మాతగా, అన్ని విభాగాల్లో రాణిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఒసితా. తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ.. యువతను ప్రోత్సహిస్తున్నాడు. ఆఫ్రికా, నైజీరియన్‌ యువత లో స్ఫూర్తి నింపేందుకు ‘ఆఫ్రికా ఇన్‌స్పైర్డ్‌ మూమెంట్‌’’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తూ సేవలందిస్తున్న ఒసితా కృషికి గుర్తింపుగా నైజీరియా దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది ఫెడరల్‌ రిపబ్లిక్‌’ వరించింది ఆయన్ని.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement