యుద్ధంలో అమెరికాకు తీవ్ర నష్టం  | Satellite imagery reveal scale of damage to US bases in Gulf Countries | Sakshi
Sakshi News home page

యుద్ధంలో అమెరికాకు తీవ్ర నష్టం 

May 8 2026 12:48 AM | Updated on May 8 2026 6:23 AM

Satellite imagery reveal scale of damage to US bases in Gulf Countries

ఇరాన్‌ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ విశ్లేషణ

వాషింగ్టన్‌: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన దానికంటే తీవ్రమైన నష్టమే వాటిల్లింది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, వాయు, నావిక దళాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. ఇరాన్‌ నుంచి ఇంతటి వినాశకరమైన ప్రతిస్పందనను ట్రంప్‌ బృందం ఊహించలేదు. ట్రంప్‌ ప్రభుత్వం గతంలో నివేదించిన దానికంటే అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించిందని తేలింది.  

15 స్థావరాల్లోని 228 నిర్మాణాలు..  
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌ విడుదల చేసిన 128 అధిక–రిజల్యూషన్‌ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’నష్ట తీవ్రతను విశ్లేషించింది. మధ్యప్రాచ్య ఉపగ్రహ చిత్రాలను అందించే రెండు వాణిజ్య సంస్థలైన వాంటోర్, ప్లానెట్‌ చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపేయాలని ట్రంప్‌ కోరడం వల్ల అమెరికాకు జరిగిన నష్ట తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇప్పటివరకు కష్టంగా ఉందని నివేదించింది.

 గల్ఫ్‌లోని 15 అమెరికా సైనిక స్థావరాల్లో 228 నిర్మాణాలు, పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. సాంకేతికంగా ఉన్నతమైన అమెరికాకు ఇది భారీ నష్టం. హ్యాంగర్లు, బ్యారక్‌లు, ఇంధన డిపోలు, విమానాలు, రాడార్, కమ్యూనికేషన్లు, వాయు రక్షణ పరికరాలపై ఇరాన్‌ దాడులు చేసింది. 

ఈ దాడులతో కొన్ని సైనిక స్థావరాలు నిరుపయోగంగా మారాయి. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్‌ ప్రధాన కార్యాలయంలో, కువైట్‌లోని మూడు స్థావరాలైన అలీ అల్‌–సలేం, అమెరికా సైన్యం ప్రాంతీయ ప్రధాన కార్యాలయం క్యాంప్‌ అరిఫ్జాన్, క్యాంప్‌ బ్యూరింగ్‌లలో అత్యధిక నష్టం జరిగింది. 

ఇందులో ఖరీదైన పేట్రియాట్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఒక విద్యుత్‌ కేంద్రం, ఐదు ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖతార్‌లోని అల్‌–ఉదైద్‌ వైమానిక స్థావరం వద్ద ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం, జోర్డాన్, యూఏఈలలోని థాడ్‌ రాడార్‌ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌ బేస్‌ వద్ద ఉన్న ఈ–3 సెంటినల్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ విమానం ధ్వంసమైంది. ఒక ఇంధన ట్యాంకర్‌ కూడా కోల్పోయింది.  

ఫ్రెండ్లీ ఫైర్‌లోనూ భారీ నష్టం..  
యుద్ధం, గాలింపు చర్యలు, ఫ్రెండ్లీ ఫైర్‌ సమయంలో అమెరికా కోల్పోయిన 40 డ్రోన్లు, యుద్ధ విమానాలనూ కోల్పోయిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కొక్కటి 30 మిలియన్‌ డాలర్ల ఖరీదు చేసే 24 ఎమ్‌క్యూ–9 రీపర్‌ డ్రోన్లు, 200 నుంచి 240 మిలియన్‌ డాలర్ల ఖరీదు చేసే అత్యంత విలువైన ఎమ్‌క్యూ–4సీ ట్రైటాన్‌ ఉన్నాయి. 

నాలుగు ఎఫ్‌–15ఈ స్ట్రైక్‌ ఈగిల్స్, ఒక ఏ–10 వార్‌హాగ్‌ కూడా కోల్పోయింది. ఒక ఎఫ్‌–35ను కూడా కూల్చి వేశామని ఇరాన్‌ పేర్కొంది. ఫిబ్రవరి 28న ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఏడుగురు అమెరికా సైనికులు మరణించారు. సుమారు 400 మంది సైనికులు గాయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు కువైట్‌లో, ఒకరు సౌదీ అరేబియాలో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.  

అత్యంత కచ్చితత్వంతో దాడులు  
200కు పైగా కట్టడాలపై ఇరాన్‌ అత్యంత కచ్చితమైన దాడులు జరిపింది. కచ్చితత్వంతో నడిచే క్షిపణులను సమర్థవంతంగా ఉపయోగించారు. భారీ ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో బ్యారక్‌లు, హ్యాంగర్లు, గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా దళాలు స్థావరాలను విడిచిపెట్టిన తర్వాత కొన్ని దాడులు జరిగి ఉండవచ్చు. 

జిమ్‌లు, ఫుడ్‌ హాల్‌లు, వసతి గృహాల వంటి సున్నితమైన లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయి. ‘ఇరాన్‌ దాడులు చాలా కచ్చితమైనవి. గురి తప్పిందని సూచించే యాదృచ్ఛిక గుంతలు ఏవీ లేవు’అని రిటైర్డ్‌ మెరైన్‌ కార్ప్స్‌ కల్నల్‌ మార్క్‌ కాన్సియన్‌’తెలిపారు. చవకైన షాహెద్‌ డ్రోన్‌లతో పోరాడటానికి విలువైన ఇంటర్‌సెప్టర్‌లను ఉపయోగించకుండా కాపాడుకోవడానికి అమెరికా ఉద్దేశపూర్వకంగా కొంత నష్టాన్ని అనుమతించి ఉండవచ్చన్నారు.  

50 బిలియన్‌ డాలర్ల ఖర్చు..  
ఈ యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 50 బిలియన్‌ డాలర్ల ఖర్చు అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇక, ఇరాన్‌ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి సుమారు 40 నుంచి 50 బిలియన్‌ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. 

ఇరాన్‌ యుద్ధ ఖర్చుగా సెనేట్‌కు సమర్పించిన 25 బిలియన్‌ డాలర్ల అంచనా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. 2027 సంవత్సరానికి 1.5 ట్రిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కోరింది. ఇది గత సంవత్సరం కంటే 42% ఎక్కువ. అయితే, డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 630 బిలియన్‌ డాలర్ల నుంచి 1 ట్రిలియన్‌ డాలర్ల మధ్య నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement