ఉక్రెయిన్‌పై భీకర దాడి | Russian missiles target western Ukraine in latest mass attack | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై భీకర దాడి

Jun 10 2025 6:07 AM | Updated on Jun 10 2025 6:07 AM

Russian missiles target western Ukraine in latest mass attack

479 డ్రోన్లు, 20 క్షిపణులు ప్రయోగించిన రష్యా  

వాటిని మధ్యలోనే కూల్చేశామన్న ఉక్రెయిన్‌ 

కీవ్‌:  తమ గడ్డపై డ్రోన్లతో తమ యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం ప్రతీకార చర్యలు తీవ్రతరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఏకంగా 479 డ్రోన్లు, 20 క్షిపణులు ఉక్రెయిన్‌ భూభాగంపై ప్రయోగించింది. రెండు దేశాల మధ్య మూడేళ్ల క్రితం యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఒకేరాత్రి ఈ స్థాయిలో దాడికి దిగడం ఇదే మొదటిసారి. ప్రధానంగా మధ్య, పశ్చిమ ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. అయితే, రష్యా ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను చాలావరకు మధ్యలోనే కూల్చివేశామని ఉక్రెయిన్‌ వైమానిక దళం సోమవారం ప్రకటించింది.

 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో మొత్తం 277 డ్రోన్లు, 19 క్షిపణులు నేలమట్టం చేశామని వెల్లడించింది. రష్యా దాడిలో ఒకరు గాయపడినట్లు తెలియజేసింది. మరోవైపు రష్యాపై వైమానిక దాడులు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఉక్రెయిన్‌ సైన్యం సోమవారం పేర్కొంది. సరిహద్దుకు 650 కిలోమీటర్ల దూరంలో రష్యా భూభాగంలో రెండు ఫైటర్‌ జెట్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అయితే, దీనిపై రష్యా సైన్యం స్పందించలేదు. మరోవైపు ఆదివారం రాత్రి ఉక్రెయిన్‌ ప్రయోగించిన 49 డ్రోన్లు కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ తేల్చిచెప్పింది. ఇదిలా ఉండగా, మృతదేహాల అప్పగింతపై రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్నాయి. వచ్చే వారం కొన్ని మృతదేహాలను పరస్పరం అప్పగించుకొనే అవకాశం కనిపిస్తోంది.    

Advertisement
 
Advertisement
Advertisement