Ukraine Crisis: ‘పశ్చిమ’ ఆయుధాలను ధ్వంసం చేశాం

Russian Army Takes Control Of Azovstal Steel Plant In Mariupol - Sakshi

లండన్‌: ఉక్రెయిన్‌లోని జైటోమిర్‌ ప్రాంతంలో భారీ సంఖ్యలో పశ్చిమ దేశాల ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సైన్యం శనివారం ప్రకటించింది. సముద్ర ఉపరితలం నుంచి ప్రయోగించే క్యాలిబర్‌ క్రూయిజ్‌ మిస్సైళ్లతో ఆ ఆయుధాలను అగ్నికి ఆహుతి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతోపాటు యూరప్‌ దేశాల నుంచి ఈ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరాయని వెల్లడించింది. డోన్బాస్‌లో రష్యా సేనలను ఎదుర్కొనడానికే వీటిని ఉక్రెయిన్‌ సిద్ధం చేసుకుందని తెలిపింది. పలుచోట్ల ఉక్రెయిన్‌ సైనిక పోస్టులను ధ్వంసం చేశామనిపేర్కొంది.

ఫిన్‌లాండ్‌కు రష్యా గ్యాస్‌ నిలిపివేత
హెల్సింకీ: నాటో కూటమిలో చేరేందుకు ఉత్సాహంగా అడుగులు ముందుకేస్తున్న ఫిన్‌లాండ్‌కు రష్యా గట్టి షాకిచ్చింది. శనివారం ఫిన్‌లాండ్‌కు గ్యాస్‌ ఎగుమతులను నిలిపివేసింది. దీంతో రష్యా నుంచి ఫిన్‌లాండ్‌కు గత 50 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న గ్యాస్‌ సరఫరా ఆగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు రష్యా నుంచి సహజ వాయువు సరఫరా నిలిచిపోయినట్లు ఫిన్‌లాండ్‌ ప్రభుత్వ రంగంలోని గాసూమ్‌ గ్యాస్‌ కంపెనీ ప్రకటించింది. తమ దేశం నుంచి గ్యాస్‌ దిగుమతి చేసుకొనే దేశాలన్నీ డాలర్లలో కాకుండా రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ డిమాండ్‌ చేశారు. కానీ, ఫిన్‌లాండ్‌నిరాకరించింది. ఫిన్‌లాండ్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని రష్యా ఇప్పటికే నిర్ణయించుకుంది. రష్యాతో ఫిన్‌లాండ్‌కు 1,340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నాటోలో చేరాలన్న ఫిన్‌లాండ్‌ ఆకాంక్షను రష్యా వ్యతిరేకిస్తోంది.  

‘40 బిలియన్‌ డాలర్ల’ బిల్లుపై బైడెన్‌ సంతకం
రష్యా దాడుల వల్ల సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు అమెరికా అందించనున్న 40 మిలియన్‌ డాలర్లకు పైగా సాయానికి సంబంధించిన బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం సంతకం చేశారు. సియోల్‌లో పర్యటిస్తున్న బైడెన్‌ వద్దకు బిల్లు కాపీని అధికారులు విమానంలో అమెరికా నుంచి ఆగమేఘాలపై తీసుకొచ్చారు. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయే అవకాశం లేదని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అమెరికా సర్కారు ఉక్రెయిన్‌కు ఇప్పటికే 13.6 బిలియన్‌ డాలర్ల సాయం అందించింది. కొత్త బిల్లులో భాగంగా 20 బిలియన్‌ డాలర్ల తోడ్పాటును సైనిక, ఆయుధ రూపంలో ఇవ్వనుంది. రష్యా దాడులను ఉక్రెయిన్‌ దళాలు సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ సాయం దోహదపడనుందని అమెరికా భావిస్తోంది. అలాగే 8 బిలియన్‌ డాలర్ల సాధారణ సాయం, ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు 5 బిలియన్‌ డాలర్లు, శరణార్థుల కోసం బిలియన్‌ డాలర్లను ఇవ్వనుంది.

మాపై అత్యాచారాలు ఆపండి: కేన్స్‌ ఫెస్టివల్‌లో మహిళ అర్ధనగ్న నిరసన
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో శుక్రవారం సాయంత్రం అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల దాష్టీకాలను వ్యతిరేకిస్తూ ఓ మహిళ  నిరసన వ్యక్తం చేసింది. రెడ్‌కార్పెట్‌పైకి చేరుకోగానే ఒంటిపై బట్టలు విప్పేసింది. తన శరీరంపై ఉక్రెయిన్‌ జాతీయ పతాకం పెయింటింగ్‌తోపాటు ‘మాపై అత్యాచారాలు ఆపండి’ అని రాసి ఉన్న ఆక్షరాలను ప్రదర్శించింది. మహిళ శరీరంపై కేవలం ఎరుపు రంగు లో దుస్తులు మాత్రమే ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఫిలిం ఫెస్టివల్‌లో స్వల్ప అంతరాయం కలిగింది. 

ఇది కూడా చదవండి: దుస్తులు విప్పేసి ఉక్రెయిన్‌ మహిళ నిరసన.. వీడియో వైరల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top