 
													వాష్టింగన్/మాస్కో: ఉక్రెయిన్-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో డీల్ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చినట్టు యూఎస్‌కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరడం విశేషం.
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్దం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే, జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇక,గత మూడు వారాలుగా పలు నిబంధనలపై అమెరికా, రష్యా అధికారులు చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డిమాండ్లు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్‌హౌస్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారు’ అని స్పష్టం చేశారు.
Trump threatens Putin with 'devastating' punishment if he doesn't agree to 30-day ceasefire with Ukraine. pic.twitter.com/vU6rLTX479
— Daily Mail Online (@MailOnline) March 12, 2025
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ మాత్రం కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్‌లో విదేశీ దళాలను మోహరించకూడదని చెబుతోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తోంది. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
