
టోక్యో: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా సారథ్యంలో అధికార కూటమికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పార్లమెంట్ ఎగువసభలోని 248 సీట్లకు గాను ఆదివారం సగం సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే ఎగువసభలో అధికార పక్షానికి 75 సీట్లుండగా తాజా ఎన్నికల్లో మరో 50 సీట్లు నెగ్గాల్సి ఉంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇషిబాకు 32 నుంచి 51 వరకు సీట్లు మాత్రమే దక్కవచ్చని చెబుతున్నాయి. ఎగువ సభలో మెజారిటీ లేకుంటే ఇషిబా సర్కారుకు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పూ ఉండదు.
కానీ, ఈ ప్రభావం దేశాన్ని రాజకీయ అస్థిరతకు గురి చేసే అవకాశాలున్నాయంటున్నారు. సంకీర్ణ పక్షాలు ఇషిబాను గద్దె దిగాలని కోరవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇషిబా కొత్త భాగస్వామ్యపార్టీని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతిమంగా, ఈ పరిణామాలు దేశంలో రాజకీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదముందని పరిశీలకులు భావిస్తున్నారు. అసలే అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికార పక్షాన్ని నిత్యావసరాల ధరల పెరుగుదల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు ప్రజాదరణను దూరం చేశాయని భావిస్తున్నారు.