
మొదటి ప్రార్థనలో కొత్త పోప్ లియో 14
వాటికన్ సిటీ: కొత్తగా ఎన్నికైన పోప్ లియో 14 తన మొదటి ప్రార్థనను నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దైవం పట్ల విశ్వాసాన్ని కలిగించాలని, విశ్వాసం లేకపోవడాన్ని తీవ్రంగా ఎదుర్కోవాలని కాథలిక్ చర్చికి పిలుపునిచ్చారు. చర్చిలు ఈ ప్రపంచంలోని చీకటి రాత్రులను ప్రకాశవంతం చేసే దీపస్తంభాలని, నిర్వహణలో విశ్వసనీయంగా ఉంటానని చెప్పారు. 267వ పోప్‌గా ఎన్నికైన మరుసటి రోజు ఆయన కార్డిన్సల్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజలు విశ్వాసానికి దూరమై, సాంకేతికత, డబ్బు, విజయం, అధికారం, ఆనందం వైపు మొగ్గచూపుతున్న ఈ సమయంలో విశ్వాసాన్ని అసంబద్ధంగా భావించే ప్రమాదముందని హెచ్చరించారు. ఇందుకు ప్రచారం అవసరమని గుర్తు చేశారు. ‘విశ్వాసం లేకపోవడమంటే జీవితం అర్థాన్ని కోల్పోవడం, దయను విస్మరించడం, మానవ గౌరవాన్ని ఉల్లంఘించడం, కుటుంబ సంక్షోభమని.. ఇది సమాజానికి చెడు గాయాలను చేస్తుందని ఇటాలియన్‌లో ప్రసంగించారు. 69 ఏళ్ల పోప్ లియో బంగారంతో అలంకరించిన తెల్లటి పాపల్ వ్రస్తాన్ని ధరించి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాటికన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
మే 18న అధికారిక ప్రమాణ స్వీకారం
నూతన పోప్ లియో14 మే 18న అధికారికంగా పోప్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో మొదటి బహిరంగ ప్రార్థన నిర్వహిస్తారు. ఆ తరువాత మొదటి సాధారణ సమావేశం మే 21న జరగనుంది. అయితే.. పోప్ ఫ్రాన్సిస్ మరణంతో సాంకేతికంగా ఉద్యోగాలు కోల్పోయిన వాటికన్ సంస్థల అధిపతులు, సభ్యులందరూ తదుపరి నోటీసు వచ్చేవరకు పదవిలో ఉండాలని లియో కోరారు.
పోప్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
పోప్ లియో 14కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘పోప్ లియో 14కు భారత ప్రజల నుంచి హృదయపూర్వక అభినందనలు. శుభాకాంక్షలు. శాంతి, సామరస్యం, సంఘీభావం, సేవ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో కాథలిక్ చర్చి నాయకత్వం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన భాగస్వామ్య విలువలను పెంపొందించడానికి హోలీ సీతో నిరంతర చర్చలకు భారతదేశం కట్టుబడి ఉంది’’అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
పోప్‌కు రాహుల్‌గాంధీ అభినందనలు
2వేల ఏళ్ల చరిత్ర కలిగిన కాథలిక్ చర్చికి మొట్టమొదటి అమెరికన్ పోప్‌గా ఎన్నికైన కార్డినల్ రాబర్ట్ ప్రెవోస్ట్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం అభినందించారు. ‘పోప్ లియో 14కు అభినందనలు. ఆయన నాయకత్వంలో శాంతిని, కరుణను, మానవాళికి సేవను పెంపొందించాలి. ఈ సంతోషకరమైన సందర్భంలో ప్రపంచ కాథలిక్ కమ్యూనిటీకి నా శుభాకాంక్షలు’’అని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.