కరోనా టీకా అందరికీ అందాలి

Pope Francis Makes Christmas Appeal for Nations to Share Vaccines - Sakshi

వైరస్‌ బారినపడే అవకాశం ఉన్నవారికి ముందుగా టీకా ఇవ్వాలి 

పోప్‌ ఫ్రాన్సిస్‌ విజ్ఞప్తి  

వాటికన్‌ సిటీ: కరోనా టీకాపై పేటెంట్‌ హక్కులు ఎవరికి ఉన్నప్పటికీ.. అది ప్రజలందరికీ అందాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆకాంక్షించారు. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారికి, వైరస్‌ బాధితులకు తొలుత టీకా అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని విన్నవించారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పోప్‌ ఇటలీలో ఉన్న వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ నుంచి సందేశం ఇచ్చారు. కరోనా బారినపడే అవకాశం ఉన్నవారికి ముందుగా టీకా ఇస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

పలు కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చెందుతుండడం ప్రపంచానికి ఒక ఆశారేఖ లాంటిదేనని అన్నారు. పోటీని కాదు, పరస్పర సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాల అధినేతలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ముందడుగు వేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనుషులంతా ఒకరికొకరు సహరించుకోవాలని చెప్పారు.  మన కుటుంబం, మన మతం, మన వర్గం కాకపోయినా ఇతరులకు స్నేహ హస్తం అందించాలని ఉద్బోధించారు.

కళ  తగ్గిన క్రిస్మస్‌
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది క్రిస్మస్‌ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్షలు, సరిహద్దుల మూసివేతలు, ప్రయాణాల నిషేధాలతో క్రిస్మస్‌ కాంతులు మసకబారాయి. అయితే వ్యాక్సిన్లపై ఆశలు మానవాళి మదిలో కదలాడుతూ పండుగ స్ఫూర్తిని కొనసాగించేలా చేశాయని, కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో అధికారికంగా చర్చ్‌లు సామూహిక ప్రార్ధనలు రద్దు చేశాయి. ధాయ్‌లాండ్‌ తదితర దేశాలకు పండుగ కోసం వచ్చిన స్వదేశీయులు క్వారంటైన్‌లో గడుపుతున్నారు. ఆఫ్రికాదేశాల్లో సైతం ప్రజలు ఆంక్షల మూలంగా పండుగ ఉత్సాహాన్ని పొందలేకపోయారు. వాటికన్‌లో క్రిస్మస్‌ రోజు ఆనవాయితీగా సెయింట్‌ పీటర్‌ బాసిలికా బాల్కనీలో దర్శనమిచ్చే పోప్, ఈ దఫా దర్శనాన్ని రద్దు చేసుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top