ఫైజర్‌ ప్రయోగాల్లో అపశ్రుతి

Pfizer COVID-19 vaccine trial volunteer says severe hangover - Sakshi

ఫార్మా కంపెనీ ఫైజర్‌ తయారు చేస్తున్న కోవిడ్‌ టీకా ప్రయోగాల్లో అపశ్రుతి దొర్లింది. టీకా తీసుకున్న కొంతమందిలో కొన్ని దుష్పరిణామాలు కనిపించాయన్న వార్తలు వస్తున్నాయి. జలుబు నివారణకు టీకా తీసుకున్నప్పుడు కనిపించే ప్రభావాల మాదిరిగానే ఇవీ ఉన్నాయని వారు చెబుతున్నారు. టీకా దుష్పరిణామం మద్యం తీసుకున్న తరువాత వచ్చే హ్యాంగోవర్‌ మాదిరిగా ఉందని ఒక కార్యకర్త చెప్పారు. ఫైజర్‌ కంపెనీ ఆరు దేశాల్లో సుమారు 43,500 మందిని ఎంపిక చేసి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. టెక్సస్‌లోని 45 ఏళ్ల కార్యకర్త కారీ టీకా రెండో డోసు తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపించాయని తెలిపారు. కారీ తొలి డోసు సెప్టెంబర్‌లో నెలలో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రయోగాల్లో తమకు ఎలాంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాలూ కనిపించ లేదని ఫైజర్, దాని భాగస్వామి సంస్థ∙బయోఎన్‌టెక్‌లు తెలిపాయి.

భారత్‌లో రికవరీ రేటు 92.89%
భారత్‌లో కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో 47,905 బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,916కు చేరుకుంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 80,66,501 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 92.89% శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం పేర్కొంది. అదేవిధంగా, ఈ వ్యాధితో 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 550 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 1,28,121గా నమోదైంది. కోవిడ్‌ టీకా పరిశోధనలకు రూ.900 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రకటించారు. కోవిడ్‌ సురక్ష మిషన్‌ కోసం ఈ నిధులను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకి అందిస్తున్నామని మంత్రి తెలిపారు. టీకా పరిశోధనలు, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని పంపణీ కోసం వేరుగా నిధులు అందిస్తామని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top