పాకిస్తాన్‌ పుట్టినప్పటి నుంచీ అబద్ధాలే.. | Pakistan Started Lying As Soon As It Was Born, Says India Foreign Secretary Vikram Misri | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ పుట్టినప్పటి నుంచీ అబద్ధాలే..

May 9 2025 9:51 AM | Updated on May 9 2025 11:11 AM

Pakistan started lying as soon as it was born India foreign secretary vikram misri

అంత్యక్రియలప్పటి ఫొటోను చూపుతున్న మిస్రీ

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల శిబిరా లు, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా ముష్కర మూకలకు పాకిస్తాన్‌ నిస్సిగ్గుగా మద్దతిస్తోందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు.

పాకిస్తాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో టెర్రరిస్టు క్యాంపులపై జరిగిన దాడికి మతం రంగు పులుముతోందని పాక్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుట్టినప్పటి నుంచి పాకిస్తాన్‌ అబద్ధాలే చెబుతోందని విమర్శించారు. 1947 నుంచి పాకిస్తాన్‌ అబద్ధాలు వినడం అందరికీ అలవాటైపోయిందని అన్నారు. విక్రం మిస్రీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడా రు. పాకిస్తాన్‌ తీరుపై విరుచుకుపడ్డారు.

‘‘1947లో పాకిస్తాన్‌ సైన్యం జమ్మూకశ్మీర్‌పై దాడికి దిగింది. కానీ, ఆ దాడితో సంబంధం లేదంటూ ఐక్యరాజ్యసమితికి అబద్ధాలు చెప్పింది. కేవలం గిజరినులే జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని నమ్మబలికింది. భారత సైన్యం, ఐరాస బృందం అక్కడికి చేరుకుంటే అసలు సంగతి తెలిసింది. చివరకు చేసేది లేక తమ సైన్యమే జమ్మూకశ్మీర్‌పై దాడి చేసినట్లు పాకిస్తాన్‌ అంగీకరించింది.

పాకిస్తాన్‌ అబద్ధాల ప్రయాణం 75 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి ఇది మాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. పహల్గాంపై పాక్‌ అలాంటి అబద్ధాలే చెబుతోంది. తప్పుడు ప్రచారంతో నమ్మించాలని చూస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. పుట్టుక నుంచే అబద్ధాలు మొదలు పెట్టిన పాకిస్తాన్‌ను నమ్మాల్సిన అవసరం లేదు.  

మసీదులపై భారత్‌ సైన్యం దాడి చేయలేదు  
భారత్‌కు చెందిన 15 సైనిక స్థావరాలపై దాడిచేసేందుకు పాక్‌ ప్రయత్నించగా భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. భారత్‌ను ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్‌ మత ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ప్రజలను రెచ్చగొట్టడానికి మతంకార్డు వాడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో సిక్కు మతస్తులే లక్ష్యంగా పాక్‌ సైన్యం దాడులు చేసింది. గురుద్వారాతోపాటు సిక్కు ఇళ్లపై దాడికి దిగింది. ఈ దాడుల్లో 16 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

మసీదులపై భారత సైన్యం దాడి చేసిందంటూ పాక్‌ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఉగ్రవాదుల క్యాంపులే ఇండియన్‌ ఆర్మీ లక్ష్యం. నిజానికి ఉగ్రవాదులకు మసీదుల్లో ఆశ్రయం కల్పించింది పాకిస్తానే. మసీదులను రక్షణగా వాడుకోవడం నిజం కాదా? ఆపరేషన్‌ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదులకు పాక్‌ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం దారుణం. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

భారత్‌లో పాక్‌ ఆటలు సాగవు. ఇక్కడ మతం పేరిట రెచ్చగొట్టాలని చూస్తే ఎవరూ రెచ్చిపోరు. పహల్గాంలో ఉగ్రదాడిని మతాలకు అతీతంగా భారతీయులంతా ఖండించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం–జీలం ప్రాజెక్టును ఇండియా టార్గెట్‌ చేసిందంటూ పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. ఈ సాకుతో ఇండియాలోని మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే జరగబోయే పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాలి’’అని విక్రం మిస్రీ స్పష్టంచేశారు.  

ఉగ్రవాదులకు అధికారిక అంత్యక్రియలా? 
ఆపరేషన్‌ సిందూర్‌ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్‌ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.

ఇలాంటి చర్యలతో పాకిస్తాన్‌ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్‌ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్‌ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్‌ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు.

‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement