ప్రధాని మోదీ ప్రసంగంపై పాక్‌ ఓవరాక్షన్‌.. హెచ్చరిక అంటూ.. | Pakistan Reacts On PM Modi Operation Sindoor Speech, Says India Will Prioritise Regional Stability | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ ప్రసంగంపై పాక్‌ ఓవరాక్షన్‌.. హెచ్చరిక అంటూ..

May 14 2025 7:56 AM | Updated on May 14 2025 11:29 AM

Pakistan Reacts On PM Modi Speech

ఇస్లామాబాద్‌: భారత్‌, పాక్‌ ఘర్షణల వేళ పాకిస్తాన్‌ వ్యవహారశైలిని పరిశీలిస్తామని, భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని ప్రధాని మోదీ (Modi) హెచ్చరించిన నేపథ్యంలో పాక్‌ స్పందించింది. మోదీ వ్యాఖ్యలు 'రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదమైనవి'గా ఉన్నాయని పేర్కొంటూ పాక్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌ యుద్ధం, కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ ప్రసంగంపై తాజాగా పాక్‌ విదేశాంగశాఖ స్పందిస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో..‘భారత ప్రధాని చేసిన రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్తాన్‌ తిరస్కరిస్తోంది. ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్‌ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. భారత్ కూడా ప్రాంతీయ స్థిరత్వానికి, తమ పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తిస్థాయిలో ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించింది. కాల్పుల విరమణను తామే కోరినట్లు చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. భారత్‌ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సాయుధ బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని, 'అత్యంత కీలక' లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని, పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదం-వాణిజ్యం, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాధ్యం కావు. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించదు. అణుబాంబు బెదిరింపుల్ని భారత్‌ సహించదని.. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్‌ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్‌ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందన్నారు.

మంగళవారం కూడా పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్‌లో మరో ఉగ్రదాడికి పాకిస్తాన్‌ అనుమతిస్తే మట్టికరవక తప్పదని హెచ్చరించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే శత్రువును తుదముట్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement