పాకిస్తాన్‌లో హృద్రోగుల దయనీయ పరిస్థితి.. రూ.600 హెపారిన్‌, 3 వేలకు అమ్మకం!

Pakistan: Heart Patients At Risk Due to Heparin Injection Shortage - Sakshi

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో హృద్రోగులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె రోగుల చికిత్సకు కావాల్సిన ముఖ్యమైన హెపారిన్‌ ఇంజక్షన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడింది. దీంతో అక్కడి రోగులు చికిత్స పొందడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

అయితే హెపారిన్‌ ఇంజక్షన్‌ సాధారణ ధర రూ.600 ఉన్నప్పటికీ, కొరత కారణంగా ధరను అమాంతంగా రూ.3 వేలకు పెంచి అక్రమంగా అమ్ముతున్నారని సదరు నివేదిక పేర్కొంది. అంతేగాక మందులు, వైద్య పరికరాల కొరతను కారణంగా  వైద్యులు సర్జరీలు నిర్వహించడం లేదని వెల్లడించింది.

మరోవైపు ఇంజక్షన్‌ ధరలను భారీగా పెంచడంతో పేద ప్రజలు వాటిని కొనడం అందని ద్రాక్షలాగా మారింది.  రోగులు ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడుతుండటంతో అక్కడి స్థానిక ఫార్మాస్యూటికల్‌ తయారీదారులు మందుల ఉత్పత్తిని వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా  దేశపు ఔషధ తయారీ ఉత్పత్తిలో దాదాపు 95 శాతం ముడి సరుకులు పొరుగు దేశాలైన భారత్‌, చైనాల నుంచే దిగుమతి అవుతాయని గణాంకాలు పేర్కొన్నాయి. ఆర్థికంగా పరిస్థితులు దిగజారడంతో.. దాయాది దేశపు ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది.
చదవండి: 9 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటించనున్న పాక్‌ మంత్రి.. ఎందుకంటే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top