అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కూడా ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా నిలుస్తున్న ఐరోపా దేశాల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ఇదొక 'ఎకనామిక్ మిరకిల్' అని ట్రంప్ అభివర్ణించారు. తన టారిఫ్ విధానాల వల్ల దేశంలోకి $18 ట్రిలియన్ల (సుమారు రూ. 1,512 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధిస్తున్న భారీ సుంకాల వల్ల, అమెరికా దిగుమతిదారులు ఎక్కువ పన్ను కడుతున్నారు. దీంతో వస్తువుల ధరలు పెరిగి సామాన్య అమెరికా ప్రజలే నష్టపోతున్నారు.
ట్రంప్‌పై కాసుల వర్షం
అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే ట్రంప్ ఆస్తులే ఎక్కువగా పెరిగనట్లు తెలుస్తోంది. న్యూయర్క్ టైమ్స్ ప్రకారం.. రెండోసారి అధ్యక్షుడైన ఆయన కేవలం ఒకే ఏడాదిలో $1.4 బిలియన్లు (సుమారు రూ. 12,810 కోట్లు) సంపాదించినట్లు సమాచారం. ట్రంప్ తన క్రిప్టోకరెన్సీ వెంచర్‌ల నుంచి గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించారంట.
ఆయన కుటుంబానికి చెందిన 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్', 'మీమ్ కాయిన్'($TRUMP) ద్వారా వందల మిలియన్ల డాలర్లు వచ్చినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒమన్,సౌదీ అరేబియా, వియత్నాం వంటి దేశాల్లో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టుల ద్వారా కోట్లాది రూపాయలు లైసెన్సింగ్ ఫీజుల రూపంలో ట్రంప్ 23 మిలియన్ డాలర్లు సంపాదించారని సమాచారం.


