నడి సంద్రంలో.. 14 గంటలు

Pacific Ocean: Sailor Rescued 14 Hours After He Fell Off Ship - Sakshi

అది పసిఫిక్‌ మహాసముద్రం. ఆ మహాసముద్రంలో మధ్యలో ఒంటిరిగా ఓ వ్యక్తి. తన ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డాడు. నీటిలో ఈదుతూ 14 గంటలు యముడితో పోరాడాడు. తుదకు తానే గెలిచాడు. తన కుటుంబంలో ఆనందం నింపాడు. ఈ సంఘటన ఎలా జరిగిందంటే.. సిల్వర్‌ సపోర్టర్‌ అనే ఓడలో విడామ్‌ పెరివెటిలోవ్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న ఆ ఓడ న్యూజిలాండ్‌లోని టౌరంగా పోర్టు నుంచి పిట్‌కెయిర్న్‌ దీవులకు సరుకులతో బయలుదేరింది. ఇంజిన్‌ రూంలో నైట్‌ డ్యూటీ విధులు ముగించుకున్న 52 ఏళ్ల విడామ్‌.. తెల్లవారుజామున తన కొడుకుతో ఫోన్‌లో మాట్లాడుతూ ఓడ డెక్‌ పైకి వచ్చాడు. నిద్రవస్తోందని కూడా కుమారుడికి చెప్పాడు. నిద్ర మత్తులో ఉన్న విడామ్‌ ఆ తర్వాత కొద్ది సేపటికే ఓడపై నుంచి సముద్రంలో పడిపోయాడు. ఇది గమనించని ఓడ సిబ్బంది ముందుకు వెళ్లిపోయారు. నీటిలో పడ్డ విడామ్‌ పైకి వచ్చి చూసే సరికి ఓడ దూరంగా వెళ్లిపోయింది.  

ఫిషింగ్‌ బెలూన్‌ ఆసరా.. 
లైఫ్‌ జాకెట్‌ లేదు. ఎటు చూసినా నీళ్లు. ఎటు ఈదాలో తెలియదు. నడి సంద్రంలో విడామ్‌ పరిస్థితి కడు దీనంగా తయారైంది. దూరంగా ఏదో నల్లగా కనబడితే ఆదేదో దీవి అనుకుని అటు ఈదడం మొదలు పెట్టాడు. చాలా సేపు ఈదిన తర్వాత దానికి దగ్గరా వచ్చాడు. అప్పడు తెలిసింది అది దీవి కాదు. చేపల వేటకు ఉపయోగించే రబ్బరు బెలూన్‌ అని. దాన్నే ఆసరా చేసుకున్నాడు. దాన్ని అంటిపెట్టుకుని తాను మునిగిపోకుండా చూసుకున్నాడు. తాను ఎలాగైనా బతకాలని అనుకుని ఆ బెలూన్‌తోనే పాటే కొంత సేపు తేలుతూ.. కొంత సేపు ఈదుతూ ఉండిపోయాడు.  

ఆరు గంటల తర్వాత..
విడామ్‌ ఓడలో లేని విషయాన్ని ఉదయం పది గంటల తర్వాత సిబ్బంది గుర్తించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకూ విడామ్‌ షిప్‌లోనే ఉన్నట్లు నిర్దారించుకున్న సిబ్బంది.. ఎక్కడ పడిపోయి ఉంటాడో అనే అంచనా వేశారు. 400 నాటికల్‌ మైళ్ల దూరంలో అతను ఉండి ఉండవచ్చని నిర్దారణకు వచ్చారు. వెంటనే ఓడను వెనక్కు తిప్పారు. ఇంతలో సమీపంలోని ఆస్ట్రల్‌ దీవుల్లో ఉన్న ఫ్రెంచ్‌ వారికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా విమానంలో వెతుకులాటకు బయలుదేరారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో తాము అనుకున్న ప్రాంతానికి షిప్‌ చేరింది. అప్పటికే సముద్రంలో విడామ్‌ అలసిపోయాడు.

దూరం నుంచి ఓడ కనబడటంతో నీరసించి ఉన్నా.. చేతిని పైకి ఎత్తి పిలిచాడు. దానిని గుర్తించిన ఓడ సిబ్బంది.. విడామ్‌ వద్దకు చేరుకుని ఓడ పైకి అతన్ని తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశారు. సుమారు 14 గంటల పోరాటం తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. అతని విల్‌ పవర్‌ చూసి ఓడ సిబ్బంది ఆశ్చర్యపోయారు. విడామ్‌కు జేజేలు పలికారు. నౌక సిబ్బందిని విడామ్‌ ఓ కోరిక కోరాడు. అదేంటంటే, ఆ బెలూన్‌ను సముద్రంలోనే వదిలేయమని.. ఎందుకంటే అది మరొకరి జీవితాన్ని రక్షిస్తుందనే ఉద్దేశంతో.

► సముద్రంలో ప్రమాదానికి గురైన తర్వాత ఎక్కువ రోజుల బ్రతికున్న వ్యక్తిగా జపాన్‌కు చెందిన కెప్టెన్‌ ఓగురి జుకుచి రికార్డు సాధించారు. 1813లో జపాన్‌ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరిన ఆయన ఓడ మధ్యలో మునిగిపోయింది. వాటి శకలాలపైనే ఆయన, మరో నావికుడు ఓటోకిచి 484 రోజులు బతికి ఉన్నారు.  

► ఎల్‌సాల్విడార్‌కు చెందిన అల్వెరెంగా 2012 నవంబర్‌లో సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదం బారిన పడింది. 2014 జనవరి వరకు అతను బతికుండి మార్షల్‌ ఐలాండ్‌ తీరానికి చేరుకున్నాడు.  
► ఆరోగ్యవంతమైన మనిషి మంచి నీళ్లు తాగకుండా 3 నుంచి 4 రోజులు బతికుండే అవకాశం ఉంది. 5 డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నీటిలో మనిషి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం బతకడం కష్టం.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top