ట్రయల్స్‌లో పాల్గొన్న బ్రిటన్‌ వ్యక్తికి అనారోగ్యం

Oxford AstraZeneca COVID Vaccine Trial Put on Hold - Sakshi

లండన్‌: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్‌ భరతం పట్టే వ్యాక్సిన్‌ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా స్పూత్నిక్‌ వి అనే వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెలువడింది. ఇక ప్రపంచ దేశాలన్ని ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి క్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ మీదనే ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షాకింగ్‌ న్యూస్‌ వెలుగు చూసింది. తుది దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలు దేశాలలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తుండగా.. బ్రిటన్‌లో కరోనా ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న ఓ వాలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించారు. దాంతో క్లినికల్‌ ట్రయల్స్‌ని తాత్కలింగా నిలిపి వేశారు. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌?)

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్‌లలో ఆస్ట్రా జెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ అన్నింటిలోకి ప్రభావవంతమయ్యింది అన్న అంచనాలున్నాయి. ఇప్పటికే రెండు దశల ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్‌, మిగతావాటికంటే ముందుగా మార్కెట్‌లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. భారత్ సహా ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో 62 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టారు. మూడోదశ ప్రయోగం విజయవంతమైతే.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ అందరిలోనూ వ్యక్తమవుతోంది. అంతేకాక ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఆ సంస్థకు ఇప్పటికే ఆర్డర్లు కూడా అందాయి. ఈ పరిస్థితుల్లో.. ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం ఓ విఘాతంలా మారింది. ఈ ట్రయల్స్‌ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది స్పష్టం చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా ఆ సంస్థ ధ్రువీకరించలేదు. (చదవండి: ఈ వారంలోనే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీ!)

అయితే ప్రయోగాల సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని, అందుకే వెంటనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని, వ్యాక్సిన్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని మాత్రమే సంస్థ పేర్కొన్నది. క్లినికల్ ట్రయల్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం కొత్తేమీ కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపే కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రయోగాలు పూర్తికాక ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేనందున.. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో మరింత జాప్యం చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top