75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ | Sakshi
Sakshi News home page

75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ

Published Sat, Feb 18 2023 5:55 AM

Nikki Haley calls for politicians over 75 to face mental competency tests - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న వారిలో 75 ఏళ్ల వయసుకు పైబడి ఉంటే వారికి ఎంతవరకు ఆ పదవికి యోగ్యత ఉందో అమెరికన్లు తప్పనిసరిగా చూడాలని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లోకి కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాషింగ్టన్‌లో ఎందరో రాజకీయ నాయకులకు వయసు మీదపడిందన్నారు.

కాంగ్రెస్‌కి ఎన్నికవాలంటే వయసు పరిమితి విధించాల్సిన ఆవశ్యకత ఉందని హేలీ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన 75 ఏళ్లకు పైబడిన వారికి యోగ్యతా పరీక్షలు నిర్వహించాలని కొత్త ప్రతిపాదన చేశారు. మరోవైపు హేలీ అభిప్రాయాలను వైట్‌ హౌస్‌ కొట్టిపారేసింది. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతూ ఉండడం, వారి వయసు 75 దాటిపోవడంతో హేలీ చేసిన ప్రతిపాదనపై విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు, దాడులు గతంలో కూడా చూశామని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరీనా జీన్‌ పియరే అన్నారు. 

Advertisement
 
Advertisement