శనివారం ఓలీని అరెస్ట్ చేసిన పోలీసులు
మాజీ హోంమంత్రి రమేశ్ లేఖక్‌ను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు
జెన్ జెడ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారంటూ అభియోగాలు
విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలని బాలెంద్ర షా సర్కార్ నిర్ణయం
కఠ్మాండు: నేపాల్ మాజీ ప్రధానమంత్రి, కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) చైర్మన్ కె.పి.శర్మ ఓలీ అరెస్టయ్యారు. గత ఏడాది జెన్ జెడ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని కఠ్మాండుకు 12 కిలోమీటర్ల దూరంలోని భక్తపూర్ జిల్లా గుండూ ఏరియాలో పోలీసులు శనివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ నూతన ప్రధానిగా బాలెంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుటి రోజే కె.పి.శర్మ ఓలీ అరెస్టు కావడం గమనార్హం.
ఇదే కేసులో హోంశాఖ మాజీ మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నేత రమేశ్ లేఖక్ సైతం అరెస్టయ్యారు. భక్తపూర్ జిల్లాలోని సూర్యబినాయక్ మున్సిపాల్టీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓలీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమించారు. గత ఏడాది సెప్టెంబర్ 8, 9న నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ప్రజలపై భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 23 మంది యువతీ యువకులు సహా 76 మంది మరణించారు.
తర్వాత ఓలీ ప్రభుత్వం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జెన్ జెడ్ ఉద్యమంలో హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కె.పి.శర్మ ఓలీతోపాటు రమేశ్ లేఖక్‌లను ఇందుకు బాధ్యులుగా కమిషన్ గుర్తించింది. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ తమ నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచింది. మూడేళ్ల నుంచి పదేళ్ల దాకా జైలు శిక్ష విధించాలని సూచించింది.
చట్టానికి ఎవరూ అతీతం కాదు
ప్రధానిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన బాలెంద్ర షా తన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే.. విచారణ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కె.పి.శర్మ ఓలీ, రమేశ్ లేఖక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతం కాదని నూతన హోంమంత్రి సుధాన్ గురూంగ్ తేలి్చచెప్పారు. తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని, చట్టప్రకారం ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశం ఇకపై కొత్త దిశలో పయనిస్తుందన్నారు. ఇదిలా ఉండగా, కె.పి.శర్మ ఓలీ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకున్న తర్వాత జైలుకు తరలించే అవకాశం ఉంది.
సీపీఎన్–యూఎంఎల్ కార్యకర్తల ఆందోళన
ఓలీ అరెస్టు పట్ల సీపీఎన్–యూఎంఎల్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓలీతోపాటు రమేశ్ లేఖక్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఓలీపై బాలెంద్ర షా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు.


