breaking news
K.P. Sharma Oli
-
నేపాల్ మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలీ అరెస్టు
కఠ్మాండు: నేపాల్ మాజీ ప్రధానమంత్రి, కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) చైర్మన్ కె.పి.శర్మ ఓలీ అరెస్టయ్యారు. గత ఏడాది జెన్ జెడ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని కఠ్మాండుకు 12 కిలోమీటర్ల దూరంలోని భక్తపూర్ జిల్లా గుండూ ఏరియాలో పోలీసులు శనివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ నూతన ప్రధానిగా బాలెంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుటి రోజే కె.పి.శర్మ ఓలీ అరెస్టు కావడం గమనార్హం.ఇదే కేసులో హోంశాఖ మాజీ మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నేత రమేశ్ లేఖక్ సైతం అరెస్టయ్యారు. భక్తపూర్ జిల్లాలోని సూర్యబినాయక్ మున్సిపాల్టీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓలీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమించారు. గత ఏడాది సెప్టెంబర్ 8, 9న నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ప్రజలపై భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 23 మంది యువతీ యువకులు సహా 76 మంది మరణించారు.తర్వాత ఓలీ ప్రభుత్వం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జెన్ జెడ్ ఉద్యమంలో హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కె.పి.శర్మ ఓలీతోపాటు రమేశ్ లేఖక్‌లను ఇందుకు బాధ్యులుగా కమిషన్ గుర్తించింది. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ తమ నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచింది. మూడేళ్ల నుంచి పదేళ్ల దాకా జైలు శిక్ష విధించాలని సూచించింది. చట్టానికి ఎవరూ అతీతం కాదు ప్రధానిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన బాలెంద్ర షా తన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే.. విచారణ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కె.పి.శర్మ ఓలీ, రమేశ్ లేఖక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతం కాదని నూతన హోంమంత్రి సుధాన్ గురూంగ్ తేలి్చచెప్పారు. తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని, చట్టప్రకారం ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశం ఇకపై కొత్త దిశలో పయనిస్తుందన్నారు. ఇదిలా ఉండగా, కె.పి.శర్మ ఓలీ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకున్న తర్వాత జైలుకు తరలించే అవకాశం ఉంది. సీపీఎన్–యూఎంఎల్ కార్యకర్తల ఆందోళన ఓలీ అరెస్టు పట్ల సీపీఎన్–యూఎంఎల్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓలీతోపాటు రమేశ్ లేఖక్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఓలీపై బాలెంద్ర షా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. -
మళ్లీ నేపాల్‌లో అస్థిరత
నిరంతరం సంక్షోభం నుంచి సంక్షోభానికి పయనించడం అలవాటైన నేపాల్ మరోసారి చిక్కుల్లో పడింది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం హఠాత్తుగా 275మంది సభ్యులుండే పార్లమెంటు దిగువ సభను రద్దు చేశారు. పాలకపక్షం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్)లో గత కొన్నినెలలుగా పుట్టిన ముసలం కారణంగా ప్రతినిధుల సభకు ఇంకా ఏడాది గడువుండగానే ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ ఓలి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో ఓలి ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ...అంటే 174మంది సభ్యుల మద్దతు వుంది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆదర్శనీయంగా రెండేళ్లక్రితం ఓలి నాయకత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్టు సెంటర్)లు విలీనమై సీపీఎన్గా ఏర్పడ్డాయి. అయితే కలిశాయన్న మాటేగానీ ఆ రెండు సంస్థలూ రెండు వర్గాలుగా పనిచేస్తున్నాయి. అయిదేళ్లక్రితం ఆమోదం పొంది గణతంత్ర నేపాల్ ఆవిర్భావానికి మూలకారణమైన రాజ్యాంగం ఇలా అర్థాంతరంగా పార్లమెంటు రద్దు చేయడాన్ని అంగీకరిస్తుందా లేదా అన్న అంశంలో వాదోపవాదాలు సాగుతున్నాయి. పార్లమెంటు రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో డజను పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీల విలీనంలోనే వివాదం బీజాలున్నాయి. విలీనం సందర్భంగా కుదిరిన ఒప్పందం ఇటీవలికాలం వరకూ రహస్యంగానే వుండిపోయింది. ఓలి, ప్రచండలిద్దరికీ, పార్టీలో మరికొందరికీ మాత్రమే దాని వివరాలు తెలుసు. అందులో ఇద్దరూ చెరిసగం కాలం పాలించాలన్న షరతుంది. సింహాసనం అధిరోహించాక ఓలి దాన్ని మరిచిపోవడమే తాజా వివాదానికి దారితీసింది. భిన్న పార్టీలైనా, సంస్థలైనా విలీనం కావడానికి అనేక కారణాలుంటాయి. ఐక్య సంఘటనగా కలిసి పనిచేస్తున్న క్రమంలో వాటిమధ్య ఏర్పడే సదవగాహన...ఒకే రకమైన సిద్ధాంతాలు లేదా ఆశయాలు వున్నాయన్న అభిప్రాయం...ఉమ్మడిగా సాధించాల్సింది ఎంతోవుందన్న భావన –ఇలా ఏదో ఒక ప్రేరణ వున్నప్పుడే ఏ విలీనమైనా సహేతుకమైనదవుతుంది. కానీ స్వప్రయోజనాలే పరమార్థం అయినప్పుడు పేరుకు విలీనం జరిగినా అది కాస్తా ప్రహసప్రాయంగా మిగులుతుంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీల కలయిక చివరి బాపతేనని గత కొన్ని నెలల పరిణామాలు చెబుతున్నాయి. ఒప్పందంలోని షరతు బేఖాతరు చేశాక సీపీఎన్లో రాజుకున్న మంటలు చూసి ఓలి మొదట్లో బెంబేలెత్తారు. రాజీ బేరాలు సాగించారు. సీనియర్లతో చర్చోపచర్చలు సాగించి పార్టీ కార్యనిర్వహణాధికారాలను ప్రచండకు కట్టబెట్టడానికి సమ్మతించారు. అది మొదట్లో కొన్నాళ్లు పనిచేసింది. ప్రచండ పార్టీ చైర్మన్ అయ్యారు. కానీ త్వరలోనే ఆయనకు అంతా అర్థమైంది. పార్టీ స్థాయీ సంఘాన్ని సంప్రదించకుండా మంత్రులు, విదేశాలకు రాయబారులు తదితరుల్ని నియమిస్తూ ఓలి తనను నామమాత్రం చేశారని, ప్రభుత్వంతోపాటు పార్టీపై కూడా ఆయన పట్టే సాగుతోందని గుర్తించారు. మళ్లీ ప్రచండలో అసంతృప్తి మొదలైంది. దాన్ని చల్లార్చడానికి మరో మంచి పదవి అప్పగిస్తానని ఓలి ఊరించారు. కానీ పాలనా పగ్గాలు అప్పజెప్పడం మినహా తనకు మరేదీ సమ్మతం కాదని ఆయన హఠాయించారు. పేచీ సద్దుమణగకపోవడంతో కొంతకాలంగా ఓలి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘చాలా పెద్ద చర్య’ తీసుకుంటానని కొన్ని రోజులుగా ఆయన హెచ్చరిస్తున్నారు. తాజా నిర్ణయంతో అదేమిటో అందరికీ అర్థమైంది. ఓలి, ప్రచండల మధ్య మౌలికంగా చాలా వ్యత్యాసాలున్నాయి. నేపాల్‌లో హిందూ రాజరిక వ్యవస్థ వున్న కాలంలో అమలైన పార్టీ రహిత పంచాయతీ విధానానికి వ్యతిరేకంగా అరవయ్యో దశకంలోనే ఉద్యమం సాగించి కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఓలి పార్లమెంటరీ రాజకీయాల్లో ఆరితేరారు. కానీ ప్రచండ ఇందుకు భిన్నం. ఆయన అజ్ఞాతంలో పనిచేసే కమ్యూనిస్టు పార్టీలో 1981లో చేరి, సాయుధ పోరాట రాజకీయాల్లో తలమునకలయ్యారు. అందుకే కావొచ్చు... రాజకీయ ఎత్తుగడల్లో ఓలితో పోలిస్తే ప్రచండ వెనకబడివున్నట్టు కనబడతారు. పార్టీలో కీలక నాయకులనదగ్గవారు ప్రచండతోనే వున్నారు. అందుకే ‘చాలా పెద్ద చర్య’ తీసుకుంటానని చెప్పినప్పుడు ఆయన పార్టీని చీలుస్తాడని ...ఆయనతో పార్టీనుంచి వైదొలగేవారు వుండరుగనుక ఓలి విఫలమవుతారని ప్రచండ వర్గం సీనియర్ నేతలు భావించారు. పార్టీ చీలికపై వున్న చట్ట నిబంధనలను మొన్న ఏప్రిల్‌లో మారుస్తూ ఓలి ఆర్డినెన్సు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఆ అంచనాకు కారణం కావొచ్చు. పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో దాన్ని విరమించుకున్నా, ఓలి అసలు ఆంతర్యం పార్లమెంటు రద్దని ఇప్పుడు వారికి తెలిసొచ్చింది. ఓలి తాజా నిర్ణయంపై సుప్రీంకోర్టు ఏమంటుందన్నదే అందరిలోనూ ఉత్కంఠ. 76వ అధికరణ ప్రకారం ఒక ప్రభుత్వం కుప్పకూలినప్పుడు అప్పుడుండే పార్లమెంటుద్వారా తదుపరి ప్రభుత్వం ఏర్పడటం అసాధ్యమని తేలాకే దాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలి. పాలకపక్షానికి మూడింట రెండొంతుల మెజారిటీ వుండగా పార్లమెంటును ఎలా రద్దు చేస్తారన్నదే ప్రశ్న. పాలకపార్టీ నేతలు పరస్పరం కుమ్ములాడుకుంటూ మధ్యలో పార్లమెంటుపై దాడి చేయడం సరికాదని విపక్షాలు అంటున్నాయి. నేపాల్ రాజకీయాలు మొదటినుంచీ పొరుగునున్న రెండు పెద్ద దేశాలు చైనా, భారత్‌లతో ముడిపడివుంటున్నాయి. ఓలి, ప్రచండలిద్దరూ చైనాకు సన్నిహితులే. అందుకే వారి మధ్య రాజీ కుదిర్చేందుకు చైనా లోపాయికారీగా కష్టపడింది. కానీ ఆ మధ్యవర్తిత్వం తనకు అనుకూలంగా వుండదనుకున్నారో, ఏమోగానీ ఓలి ఇటీవల మన దేశానికి దగ్గరయ్యారు. గత నెలలో మన విదేశాంగ కార్యదర్శి ఆ దేశం పర్యటించారు. భూకంప వైపరీత్యంనుంచి అయిదేళ్లయినా కోలుకోని నేపాల్ కరోనా మహమ్మారితో మరింత సంక్షోభంలో పడింది. ఇలాంటి సమయంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం చివరకు ఆ దేశాన్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి. -
మోదీతో నేపాల్ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఈ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మకు మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్‌లో పర్యటన నిమిత్తం నేపాల్ ప్రధాని కె.పి.శర్మ శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. 2011లో నేపాల్ ప్రధాని బాబురామ్ భట్టారాయ్ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మొదటిసారిగా భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2014లో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి ప్రధాని సుశీల్ కోయిరాల హాజరయ్యారు. అలాగే అదే ఏడాది ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ నేపాల్‌లో పర్యటించారు. అదే ఏడాది నవంబర్‌లో ఖాట్మండ్ వేదికగా జరిగిన సార్క్ లో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24వ తేదీన కె.పి.శర్మ భారత పర్యటన ముగించుకుని ముంబై నుంచి తిరిగి నేపాల్ కి వెళ్లతారు.


