వ్యాక్సిన్‌: ఊరటినిస్తోన్న మోడర్నా

 Moderna Says Its COVID-19 Vaccine Is Over 94 pc Effective - Sakshi

మా వాక్సిన్‌ 94 శాతం ఎఫెక్టివ్‌ :మోడర్నా

జనవరి నుంచే ప్రపంచవ్యాప్తంగా అందించే  ఉద్దేశం

రెండు వారాల్లో రెండు సంస్థలనుంచి సానుకూల  ప్రకటన

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు సంబంధించిన వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో వరుస శుభవార్తలు భారీ ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే తమ కోవిడ్‌​-19 వ్యాక్సిన్‌ 90 శాతానికి పైగా ప్రభావ వంతంగా ఉందని అమెరికా దిగ్గజం ఫైజర్‌ ప్రకటించింది. తాజాగా మరో అమెరికన్‌ సంస్థ మోడర్నా కీలక అడుగు ముందుకేసింది. తమ కరోనా వ్యాక్సిన్ 94 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని వెల్లడించింది. కోవ్‌ అని పిలుస్తున్న మూడవ దశ ట్రయల్స్‌  ప్రాథమిక దశ డేటా గేమ్‌ ఛేంజర్‌గా నిలవనుందని వ్యాఖ్యానించింది.

95 మంది కరోనా బాధితులతోపాటు 30వేల మంది పాల్గొన్న వ్యాక్సిన్‌ ప్రయోగాల ఫలితాల ఆధారంగా మోడర్నా ఈ అంచనాను వెల్లడించింది.తమ మూడవ దశ ప్రాథమిక ఫలితాల్లో తమ టీకా సామర్థ్యం 94.5 శాతంగా అంచనా వేసింది. ఈ క్రమంలో అత్యవసర వినియోగం కోసం రానున్న వారాల్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. దీంతో అమెరికా మార్కెట్లో కంపెనీ షేర్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సహకారంతో  రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను మోడర్నా రూపొందిస్తోంది.

కోవిడ్‌-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇది కీలకమైన క్షణమని మోడర్నా సీఈఓ స్టీఫేన్ బాన్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. 3వ దశ ట్రయల్స్‌లో తీవ్రమైన వ్యాధితో సహా, వ్యాధి నివారణకు సంబంధించి తొలి క్లినికల్ ఈ సానుకూల మధ్యంతర ధ్రువీకరణ అని పేర్కొన్నారు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిందనే అంశం అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. ప్రతి రోజు ముఖ్యమైనదని తెలుసు.. జనవరి ఆరంభం నుండి, ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత ఎక్కువమందిని రక్షించాలనే ఉద్దేశ్యంతో వ్యాక్సిన్‌ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశామన్నారు. మరోవైపు “నిజంగా ముఖ్యమైన మైలురాయి” అంటూ ఈ పరిణామాన్ని మోడర్నా అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ హోగ్ స్వాగతించారు. అలాగే రెండు వేర్వేరు సంస్థలనుంచి ఊరటనిచ్చే సానుకూల ఫలితాలు పొందడం భరోసా కలిగించేదన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top