పాలస్తీనా అనుకూల ప్రసంగం ఫలితం
మస్సాచుసెట్స్: పాలస్తీనా అనుకూల ప్రసంగం చేసిన భారత సంతతికి చెందిన మేఘ వేమూరిపై మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మేఘ పేరును ప్రస్తావించకుండా ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. ‘ఆ వ్యక్తి నేడు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఈ రోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించామన్న విషయాన్ని తెలియజేశాం’అని ఎంఐటీ ప్రతినిధి కింబర్లీ అలెన్ చెప్పారు. ‘ఎంఐటీ వాక్ స్వాతంత్య్రానికి మద్దతుగా నిలుస్తుంది.
ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, పదే పదే నిర్వాహకులను తప్పుదారి పట్టించి, వేదికపై నుంచి నిరసనకు నాయకత్వం వహించింది. ఒక ముఖ్యమైన వేడుకకు అంతరాయం కలిగించినందుకు ప్రతిస్పందనగా తీసుకున్న చర్యకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. గురువారం మేఘ పాలస్తీనాకు అనుకూలంగా చేసిన ప్రసంగం ఆన్‌లైన్‌లో వైరలవుతోంది. కాగా, శుక్రవారం జరిగే స్నాతకోత్సవం ప్రధాన కార్యక్రమంలో మేఘ షెడ్యూల్ ప్రకారం ప్రసంగించాల్సి ఉంది. అయితే, వివాదం నేపథ్యంలో ఆమెకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు.