ఇంజనీర్‌తో బిల్‌గేట్స్ ఎఫైర్.. సత్య నాదెళ్ల స్పందన

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఆయనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు నుంచి వైదొలగాల్సి వచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తాజాగా స్పందించారు. అప్పటికి, ఇప్పటికి కంపెనీలో చాలా మార్పులు వచ్చాయన్నారు.
సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల బిల్ గేట్స్ పేరు ప్రస్తావించకుండా ఈ అంశంపై స్పందించారు. ‘‘2000 సంవత్సరంతో పోలిస్తే కంపెనీలో పరిస్థితులు ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నాయి. చాలా మార్పులు సంభవించాయి. కంపెనీలో వైవిధ్యం, భిన్న సంస్కృతులు ప్రతి రోజు అభివృద్ధి అయ్యే వాతావారణాన్ని మేం సృష్టించామని నేను భావిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశమని నేను భావిస్తున్నాను. దాని మీదనే ప్రత్యేకంగా దృష్టి సారించాను’’ అని తెలిపారు.
‘‘మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి గురించి ఏవైనా ఆరోపణలను లేవనెత్తినప్పుడు అవతలి వారి కంఫర్ట్ గురించి కూడా ఆలోచించాలి. లేవనెత్తిన ఆరోపణలను పూర్తిగా దర్యాప్తు చేయగలిగేలా చూసుకోవాలి. అప్పటి వరకు మనకు తోచినవిధంగా ఊహించుకుని వారిని ఇబ్బంది పెట్టకూడదు" అని నాదెళ్ల తెలిపారు.
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ‘‘2000 సంవత్సరంలో బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారు. సదరు మహిళ ఈ విషయం గురించి 2019లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించింది. బాధితురాలికి పూర్తి అండగా నిలబడింది’’ అని మైక్రోసాఫ్ట్ బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.