మర్యాద ఇవ్వాల్సిందే!.. తేడాలొస్తే ఈ బొమ్మ చుక్కలు చూపిస్తుందట!

Meet Robert World Most Terrifying Haunted Doll - Sakshi

ఒక బొమ్మ.. దానిని ఇష్టపడే వ్యక్తులు. కానీ, అన్యాయంగా చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ అందులో దూరి.. అందరికీ వణుకు పుట్టిస్తూ ఉంటుంది. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా.. అన్ని భాషల్లో ఈ స్టోరీ లైన్‌తో బొమ్మల్ని బేస్‌ చేసుకుని బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే నిజజీవితంలోనూ అమ్మో బొమ్మ తరహా కథలు ప్రచారంలో ఉండడం మీరెప్పుడైనా విన్నారా?

రాబర్ట్‌.. హాంటెడ్‌ డాల్‌. అలా ఇలా కాదు.. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన బొమ్మ అదట. 1994 నుంచి యూఎస్‌ స్టేట్‌ ఫ్లోరిడా కీ వెస్ట్‌లోని ఫోర్ట్‌ ఈస్ట్‌ మార్టెల్లో మ్యూజియంలో అది ఉంటోంది. ఒక చిన్నారికి నావికుడి గెటప్‌​ వేసినట్లు ఉండే ఆ బొమ్మ.. చేతిలో మరో బొమ్మను పట్టుకున్నట్లు ఉంటుంది.  అయితే ఈ బొమ్మ వల్లే ఎన్నో అనర్థాలు జరిగాయనే ప్రచారం.. ఇదొక దెయ్యం బొమ్మనే ముద్రను వేశాయి. 

1904 సంవత్సరంలో కీ వెస్ట్‌కి చెందిన రాబర్ట్‌ ఎయుజెనె ఒట్టో అనే చిన్నారికి బర్త్‌డే గిఫ్ట్‌గా.. అతని తాత జర్మనీ నుంచి తీసుకొచ్చి మరీ ఈ బొమ్మను కానుకగా తీసుకొచ్చాడు. రాబర్ట్‌ ఆ బొమ్మను ఎంతగా ప్రేమించాడంటే.. దానికి కూడా తన పేరే పెట్టుకున్నాడు. పెద్దయ్యాక కూడా దాన్ని అతను వదల్లేదట. చివరికి ప్రాణం పోయే సమయంలోనూ ఆయన హత్తుకుని పడుకున్నాడని ఆ బొమ్మ హిస్టరీ నోట్‌లో పేర్కొని ఉంటుంది.  అయితే.. 118 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బొమ్మ ఆ తర్వాత వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. కానీ.. 

రాబర్ట్‌ బొమ్మ వేరే వాళ్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు.. ఏదో ఒక అపశ్రుతి జరిగేదన్న వాదన ఒకటి ఉంది. ప్రమాదాలు జరగడం, గాయాలు, ఎముకలు విరిగిపోవడాలు, విడాకులు.. ఇలా ఏదో ఒక చెడు జరిగేదన్న నమ్మకం ముద్రపడిపోయింది.  

1974లో రాబర్ట్‌ ఒట్టో కన్నుమూశాడు. రెండేళ్ల తర్వాత అతని భార్య సైతం చనిపోయింది. ఆ తర్వాత కీవెస్ట్‌ ఈయేటన్‌ స్ట్రీట్‌లోని వాళ్ల ఇంట్లో ఆ బొమ్మ అలాగే ఉండిపోయింది. మైర్టెల్‌ రూటర్‌ అనే వ్యక్తి 20 ఏళ్ల పాటు ఆ ఇంటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆపై మరొకరికి దానిని అమ్మేయగా.. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ గెస్ట్‌ హౌజ్‌గా మార్చేశారు. అయితే.. 

ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. రాబర్ట్‌ మరణం తర్వాతే ఈ అనుభవాలు ఎదురయ్యాయని చాలా మంది అంటున్నారు. అదీ దానిని సరిగ్గా పట్టించుకోని తరుణంలోనేనట. దీంతో దానికి అతీత శక్తులు ఉన్నాయని, దాని వల్ల ఏదో ఒక అనర్థం జరిగేదన్న నమ్మకం బలంగా స్థిరపడింది స్థానికుల్లో. దీంతో 1994లో ఆ బొమ్మను భద్రంగా ఉంచేందుకు కీ వెస్ట్‌లో ఉన్న మ్యూజియానికి అప్పజెప్పారు. అప్పటి నుంచి అదొక టూరిస్ట్‌ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అయితే అక్టోబర్‌లో మాత్రం దీనికి ఓల్డ్‌ పోస్టాఫీస్‌కు తరలిస్తుంటారు ఎందుకనో!. 

రకరకాల కథలు.. 
రాబర్ట్‌ బొమ్మ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. దానిలో ఏదో శక్తి దాగి ఉందని, అప్పుడప్పుడు ముఖకవళికలు మారుస్తుందని, ఒక్కోసారి విచిత్రమైన శబ్దాలు చేస్తుందని కొందరు చెప్తుంటారు. అంతేకాదు.. గతంలో అది మాయమై .. మరొచోట ప్రత్యక్షమైన సందర్భాలు కూడా ఉన్నాయట. ఏదేమైనా ఆ బొమ్మకు మంచి స్థానం కల్పించకపోతే కోపం వచ్చి ఏదో ఒక చెడు చేస్తుందనే నమ్మకం బలంగా ముద్రపడడంతో.. ఇప్పటికీ దానిని భద్రంగా చూసుకుంటున్నారు. ఈ బొమ్మ కథను ఆసరాగా చేసుకునే రాబర్ట్‌ సిరీస్‌లో నాలుగు సినిమాలొచ్చాయి కూడా. అలా ఓ సాధారణ బొమ్మ.. దెయ్యపు బొమ్మగా మ్యూజియంలో సకల మర్యాదలు అందుకుంటోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top