
దేశంలో తొలి కేసు నమోదు
ఎల్‌సాల్వెడార్ నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు
శరీరంలో మాంసాన్ని తినేసే ఈగ లార్వాలు
మనుషులకు ముప్పు తక్కువేనంటున్న వైద్యులు
మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీలాండ్‌లో ఓ వ్యక్తి ఈ నెల 4వ తేదీన దీనిబారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్రూ్కవార్మ్(ఎన్‌డబ్ల్యూఎస్) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ(మగ్గోట్స్) లార్వా మనిషి శరీరంలోని కణజాలంలో తిష్టవేసి, క్రమంగా మాంసాన్ని భక్షిస్తుందని అంటున్నారు. ఎల్‌సాల్వెడార్ దేశం నుంచి వ్యక్తికి వ్యాధి సోకినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) సహకారంతో తొలి కేసును నిర్ధారించినట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్, హ్యూమన్ సర్విసెస్(హెచ్‌హెచ్‌ఎస్) తెలియజేసింది.
→ ఎన్‌డబ్ల్యూఎస్ మియాసిస్ అనేది సాధారణంగా పాడి పశువులు, ఇతర జంతువుల్లో కనిపిస్తుంది. దక్షిణ అమెరికాతోపాటు కరీబియన్ దీవుల్లో దీని ఉనికి ఉంటుంది. కానీ, ఇటీవల సెంట్రల్ అమెరికా, మెక్సికోతోపాటు అమెరికాకు సైతం విస్తరించినట్లు నిపుణులు గుర్తించారు.
→ ప్రధానంగా శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నవారికి ఎన్‌డబ్ల్యూఎస్ మియాసిస్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీని ప్రభావానికి గురైన పశువులకు, ప్రాంతాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
→ కొక్లియోమియా హోమినివోరక్స్ ఈగ లార్వాలే ఈ స్రూ్కవారŠమ్స్. జంతువుల పుండ్లు, గాయాలపై వాలుతుంటాయి. పుండు భాగంలో లేదా సున్నితమైన కణజాలంపై ఒక ఆడ ఈగ ఒకేసారి 300 వరకు గుడ్లు పెట్టగలదు.
→ గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలు పుండ్ల లోపలికి చొచ్చుకెళ్తాయి. క్రమంగా మాంసాన్ని తినేస్తాయి. తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది.
→ లార్వాలు మూడు నుంచి ఐదు రోజుల్లో పుండు నుంచి బయటకు వచ్చి కిందపడిపోతాయి. భూమి కిందిభాగంలోకి చేరుకుంటాయి. ఈగలుగా మారి బయటకు వస్తాయి. గుడ్లు పెట్టడానికి పుండ్లు, గాయాలు ఉన్న జంతువులను వెతుక్కుంటాయి.
→ కొక్లియోమియా హోమినివోరక్స్ ఈగ జీవితకాలం దాదాపు 30 రోజులు. మొత్తం జీవితకాలంలో 3,000కుపైగా గుడ్లు పెడతాయి.
→ న్యూవరల్డ్ స్రూ్కవార్మ్ మియాసిస్ వల్ల మనుషులకు ముప్పు తక్కువేనని అమెరికా వైద్యులు చెబుతున్నారు. దేశంలో ఈ ఏడాది జంతువులకు ఈ పరాన్నజీవి సోకలేదు.
→ ఒకసారి సోకితే ఆ ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థతో కలిసి పని చేస్తున్నారు.
→ ఈగలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టెక్సాస్‌లో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఈగల్లో సంతానాన్ని అరికట్టడానికి ఈగలనే ప్రయోగిస్తారు. స్టెరిలైజ్ చేసిన మగ ఈగలు ఆడ ఈగలతో కలిస్తే.. ఆ ఆడ ఈగల్లో సంతాన సామర్థ్యం క్షీణిస్తుంది.
→ మనుషులు గాయాలు, పుండ్లు బయటకు కనిపించకుండా జాగ్రత్తపడితే ఈగల బారినపడే అవకాశాలు ఉండవు. గాయాలకు సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్