32 ఏళ్లు ఒంటరిగా.. ఆ దీవిలోనే జీవనం.. చివరికి

Man Leaves Island Lived On 32 Years After Being Threatened Eviction - Sakshi

మనిషి సంఘజీవి సమాజంతో తప్ప ఒంటరిగా బతకలేడు అనే మాటను మనం వినే ఉంటాం. ఇదే మాట ఈ పెద్దాయనకు వర్తించదేమో.  ఈ వ్యక్తి  ఓ దీవిలో ఏకంగా 32 ఏళ్లు ఒంటరిగా జీవించాడు. అది కూడా ఏ చీకూ చింతలేకుండా ఆనందంగానే కాలం గడిపాడు. తనతో తానే సావాసం చేసుకుంటూ బతుకుబండిని ఇన్నేళ్లు లాగేసాడు. ఎందుకంటే ఆ మధ్యధరా సముద్ర దీవి అంత అందంగా ఉంది మరి.

32 ఏళ్లుగా దీవిలోనే జీవితం
ఆ పెద్దాయన పేరు మారో మొరాండీ. వయసు 81. 1989లో దక్షిణ పసిఫిక్ మహా సముద్రానికి వెళ్తుండగా... మధ్యలో బోట్ పాడైంది. దాంతో ఈ దీవికి వచ్చిపడ్డాడు. అనుకోకుండా ఆ ప్రాంతమే అతని ఇల్లు అయిపోయింది. అప్పట్లో ఆ దీవిని మరో పెద్దాయన కేర్ టేకర్‌గా చూసుకుంటున్నాడు. ఆయన రిటైర్ అవుతున్నాడన్న విషయం తెలుసుకున్న మొరాండీ... తరువాత తానే దానికి కేర్ టేకర్‌గా ఉండాలనుకున్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా తన పడవను అమ్మేసి దీవిలోనే ఉండిపోయాడు. అక్కడే ఓ ఇల్లు కూడా కట్టుకున్నాడు. నిజానికి ఆ ఇల్లు ముందే నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి షెల్టర్‌ను ఇల్లుగా చేసుకున్నాడు. 


దీవి నుంచి వెళ్లాలని లేదు
32 ఏళ్లుగా ఆ దీవిలోనే ఉంటున్న మొరాండీ... అలా జీవించేందుకు నానా కష్టాలు పడ్డాడు. ప్రకృతి విలయాలతో పోరాడాడు. దీవి అందం చెడిపోకుండా కాపాడాడు. ఐతే... 2016లో ఆ దీవిలో అతను ఉన్న విషయం తెలిసింది. ఆ దీవిని అతను ఖాళీ చెయ్యాలంటూ... లా మద్దలేనా ఆర్చిపెలాగో నేషనల్ పార్క్ నోటీస్ పంపింది. దాంతో వారి మధ్య న్యాయపోరాటం మొదలైంది. తాజాగా కోర్టు కూడా ఆ దీవి పార్కుకే చెందుతుందని తీర్పునిచ్చింది. దీంతో అతన్ని ఖాళీ చెయ్యమని చెప్పింది. ఐతే... ఐదేళ్లుగా మొరాండీకి మద్దతుగా చాలా మంది పిటిషన్‌పై సంతకాలు చేశారు. అధికారులు మాత్రం అతను ఖాళీ చెయ్యాల్సిందేనని పట్టుపట్టారు. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ దీవిని వదిలి వెళ్లడం బాధగా ఉంది. నేను ఒకప్పుడు మెయిన్ టౌన్‌కి శివార్లలో ఉండేవాణ్ని. ఇప్పుడు అక్కడికే వెళ్లి... షాపింగ్ చేసి బట్టలు కొనుక్కుంటా. నా జీవితాన్ని జీవిస్తా. అయినా నా జీవితంలో పెద్దగా మార్పేమీ రాదు. ఇకపైనా నేను సముద్రాన్ని చూస్తాను’ అని మొరాండీ తెలిపాడు.

( చదవండి: ఇదేం వింత.. చేతి వేళ్లు ఈ రంగులో ఉన్నాయేంటి? )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top