Mona Lisa Painting: మోనాలిసా పెయింటింగ్‌ ధ్వంసానికి యత్నం! మారు వేషంలో వచ్చి మరీ..

Man In Elderly Woman Getup Smears Mona Lisa Portrait With Cake  - Sakshi

ప్యారిస్‌: సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్‌ పెయింటింగ్‌ మోనాలిసాను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. కళా ప్రియులు, సందర్శకుల సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం.

వృద్ధురాలి గెటప్‌లో వీల్‌చైర్‌లో సందర్శనకు వచ్చిన ఓ యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. వీల్‌చైర్‌ నుంచి ఒక్కసారిగా బయటకు దూకి.. పెయింటింగ్‌ వైపు దూసుకెళ్లాడు. ఆపై  కేక్‌ను పెయిటింగ్‌ మీదకు విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా మళ్లీ పెయింటింగ్‌ దగ్గరగా దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. 

అయితే పెయింటింగ్‌ మీద ఉన్న గ్లాస్‌కు ఆ కేక్‌ అంటడంతో పెయింటింగ్‌కు ఎలాంటి డ్యామేజ్‌ కాలేదు. సుప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ గీసిన ఈ పెయింటింగ్‌.. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. ప్రస్తుతం దాడి వీడియో వైరల్‌ అవుతోంది. దాడికి పాల్పడిన వ్యక్తి పర్యావరణవేత్తగా తెలుస్తోంది. ఈ భూమిని కొందరు నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ ఫ్రెంచ్‌లో అతను నినాదాలు చేయడం విశేషం.

అతను పెయింటింగ్‌ ధ్వంసం కోసమే యత్నించాడా? లేదంటే కేక్‌ పూయడం ద్వారా నిరసన తెలపాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సెక్యూరిటీ కళ్లు గప్పి అసలు కేకును అతను లోపలికి ఎలా తీసుకెళ్లడన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. మోనాలిసా పెయింటింగ్‌ ఇలా దాడులకు లక్ష్యంగా మారడం ఇదేం కొత్త కాదు. 1956లో ఓ ఆగంతకుడి సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ దాడిలో పెయింటింగ్‌ కింది భాగంగా.. బాగా డ్యామేజ్‌ అయ్యింది కూడా. అప్పటి నుంచి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గ్లాసులో ఆ పెయింటింగ్‌ను భద్రపరిచారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top