‘‘నన్ను చూసి ఏడ్వకు’’, ‘‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’ ఇలాంటి ఎన్నో సందేశాలను మనం సాధారణంగా ఆటోల వెనుక, లారీల వెనుక చూస్తూంటాం. వీటితో పాటు కొన్ని ఫన్నీ కోట్‌లు, చిత్ర విచిత్రమైన సందేశాలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఒక కారు వెనుక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కొటేషన్ ఒకటి నెట్టింట సందడిగా మారింది. అదేంటో తెలుసుకుందామా.
అమ్మాయి అనగానే ‘ఆడ’ బిడ్డ అంటూ అనేక కుటుంబాలలో ఇప్పటికీ ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో, ఈ సందేశంతో కూడిన వీడియో అందరి హృదయాలను హత్తుకుంది.
“మీరు నన్ను భయపెట్టలేరు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.” అన్నమెసేజ్ . దీంతోపాటు, దీని “M,” “A” “S” అనే అక్షరాలు ఉన్నాయి. అంటే అవి అతని కుమార్తెల పేర్లను సూచిస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఒక్కోసారి చిన్న మాటలే ఎంత శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వగలవో ఇది నిరూపించింది. ఈ క్లిప్‌ను కరాచీకి చెందిన వ్లాగర్ ఒకరు ఇన్‌స్టాలో పంచుకున్నారు. తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ముందు వెళ్తున్న కారు వెనుక భాగంలో దీన్ని గమనించి రికార్డ్ చేశారు. ఆ రోజు తాను చూసిన అత్యంత హృద్యమైన విషయాలలో ఇది ఒకటి అంటూ పాకిస్థాన్‌కు చెందిన ఒక చిన్న వీడియోను ఇన్‌స్టాలో ఫాలోయర్లతో పంచుకున్నారు. "ఒక తండ్రి కల" అని క్యాప్షన్‌తో చేసిన వ్లాగర్ ఈ పోస్ట్ ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది.
నెటిజన్ల రియాక్షన్
ఇతడు మేలిమి బంగారం అని ఒకరు, మరొకరు, “ప్రతి కుమార్తెకు ఇలాంటి తండ్రి ఉండాలని కలలు కంటుంది” అని వ్యాఖ్యానించారు.“ఆడపిల్లలను ఇప్పటికీ భారంలా చూసే సమాజంలో, ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్,” అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి, “పప్పా మేరీ జాన్ బచావో” , “ఎంత గర్వపడే తండ్రి,” అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోగా, “ఎంత ముద్దుగా ఉంది,” “అదృష్టవంతుడు,” “మా నాన్నలాగే,” లాంటి స్పందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఒక వ్యక్తి చమత్కారంగా, “మరొకరిని కనండి, అప్పుడు మీరు వారిని MASS అని పిలవవచ్చు” అని సూచించడం విశేషం.


