టైటాన్‌ సముద్రం లోతు తెలిసింది!

Largest Sea On Titan Could Be Over 1000 Feet Deep - Sakshi

శని గ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో టైటాన్‌ ఉపగ్రహానికి పలు ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా దీనిపై వాతావరణం భూమి తొలినాళ్ల వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్‌లో జీవ ఆవిర్భావానికి ఈ గ్రహంపై అనుకూలతలు ఎక్కువని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. జీవావిర్భివానికి సంబంధించిన అవకాశాల గురించి టైటాన్‌పై అతిపెద్ద సముద్రం క్రాకెన్‌ మారెపై సైంటిస్టులు పరిశోధన జరుపుతున్నారు. తాజాగా ఈ పరిశోధనల్లో ఈ సముద్ర కేంద్రం వద్ద వెయ్యి అడుగుల లోతు ఉంటుందని తేలింది. ఇంతవరకు దీని లోతు 300 అడుగులేనని భావించారు. దీంతో సముద్రం లోపలకి రోబోటిక్‌ సబ్‌మెరైన్‌ పంపి ప్రయోగాలు చేయవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.

టైటాన్‌ ఉత్తర ధృవం వద్ద ఉన్న ఈ సముద్ర విస్తీర్ణం దాదాపు 1.54 లక్షల చదరపు మైళ్లు. భూమిపై ఉన్న కాస్పియన్‌ సముద్రం కన్నా ఇది పెద్దది. ఇందులో ద్రవరూపం లో ఉండే ఈథేన్, మీథేన్‌ ఇతర హైడ్రోకార్బన్లున్నాయి. ఇవన్నీ జీవి పుట్టుకకు మూలపదార్ధాలుగా ఉపయోగపడేవి కావడం గమనార్హం. తాజా పరిశోధనతో సముద్రం లోతు తెలిసిందని, టైటాన్‌పై భూమి తొలినాళ్లలో ఉన్న వాతావరణం ఉందని సీసీఏపీఎస్‌ సంస్థ తెలిపింది. 1997లో నాసా పంపిన కసిని స్పేస్‌ ప్రోబ్‌ టైటాన్‌పై ఈ సముద్రాన్ని గుర్తించింది. 2008లో ఈ సముద్రానికి క్రాకెన్‌ మారె అని పేరుపెట్టారు. ఈ సముద్రం మధ్యలో మైడా ఇన్సులా అనే ద్వీపం కూడా ఉంది. ఈ సముద్రం లోతు తెలియడంతో ఈ దఫా పరిశోధనల్లో సముద్ర అంతర్భాగంలో తిరిగే విధంగా ఒక జలాంతర్గామిని పంపేందుకు సైంటిస్టులు యోచిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top