King Charles: బ్రిటన్‌ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే

King Charles III: Unusual Facts About Britain New Monarch - Sakshi

లండన్‌: బ్రిటన్‌ను సుధీర్ఘకాలం పాలించిన మ‌హారాణి రెండ‌వ ఎలిజ‌బెత్ క‌న్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎలిజ‌బెత్ గురువారం మధ్యాహ్నం స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ కోటలో తుదిశ్వాస విడిచారు. 25 ఏళ్లకే బ్రిటన్‌ రాణి కిరీటం అందుకున్న ఎలిజబెత్‌ 70 ఏళ్లకు పైగా ఆ హోదాలో కొనసాగారు. ఇక ఎలిజబెత్‌ మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా అవతరించనున్నారు. చార్లెస్‌కు అధికారికంగా పట్టాభిషేకం చేసేందుకు కొన్ని నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. రాణి ఎలిజబెత్‌-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్‌ (73) బ్రిటన్‌కు కొత్త రాజు కానున్నారు. చార్లెస్‌ 1948 నవంబరు 14న బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జన్మించారు. ఎలిజబెత్‌ నలుగురు సంతానంలో చార్లెస్‌ పెద్దవారు. 

1981లో డయానాను వివాహమాడిన చార్లెస్‌ దంపతులకు ఇద్దరు కుమారులు.. ప్రిన్స్‌ విలియమ్‌, ప్రిన్స్‌ హ్యారీ. వ్యక్తిగత కారణాలతో చార్లెస్‌ డయానా దంపతులు 1992లో విడిపోయారు. అనంతరం 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్‌.. కెమెల్లా పార్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. మాజీ ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ అయిన చార్లెస్‌.. కింగ్‌ చార్లెస్‌-3గా వ్యవహరించనున్నారు. అలాగే 14 కామన్వెల్త్‌ దేశాలకూ రాజుగా కూడా ఉంటారు. 

బ్రిటన్‌ కొత్త రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు
పాస్‌పోర్టు లేకుండా విహారం
బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌-III పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లగలరు. లైసెన్స్‌ లేకుండా ప్రయాణించగలరు. రాజకుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరి ఆయనకి పాస్‌పోర్టు అవసరం లేదు. బ్రిటన్‌ రాజు ఎక్కడా, ఎలాంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా ప్రయణించగలడు. వారికి అవసరమైన సహాయాన్ని, రక్షణ అందిస్తూ బ్రిటన్‌ రాజు పేరు మీద ప్రత్యేక డాక్యుమెంట్‌ జారీ చేస్తారు. ఈ కారణంతో బ్రిటన్‌లో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయగల ఏకైక వ్యక్తి రాజు మాత్రమే.

రెండు పుట్టినరోజులు
చార్లెస్ తల్లి, క్వీన్ ఎలిజబెత్‌-2 రెండు పుట్టినరోజులు జరుపుకుంటారు. ఆమె అసలు పుట్టిన రోజుఏప్రిల్ 21. దీనిని ప్రైవేట్‌గా జరుపుకుంటారు. అయితే వేసవి వాతావరణం అవుట్‌డోర్‌ పరేడ్స్‌(బహిరంగ కవాతులకు) అనుకూలంగా ఉంటుందని జూన్‌ నెలలోని రెండో మంగళవారాన్ని రాణి అధికారిక బహిరంగ వేడుకగా నిర్వహిస్తారు. ఇక చార్లెస్ పుట్టినరోజు కూడా శీతాకాలం ప్రారంభమయ్యే నవంబర్ 14న ఉండటంతో అతని బర్త్‌డేను కూడా వేసవి నెలలో 2అధికారిక పుట్టినరోజు’గా జరిపే అవకాశం ఉంది.

ఈ బహిరంగ వేడుకల్లో 1,400 కంటే ఎక్కువ మంది సైనికులు, 200 గుర్రాలు, 400 మంది సంగీతకారులు పాల్గొంటారు. సెంట్రల్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి రాజ కుటుంబ సభ్యులు చూస్తుండగా రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లై-పాస్ట్‌తో ఈ వేడుక కార్యక్రమాలను ముగిస్తుంది.

నో ఓటింగ్‌
బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు ఓటింగ్‌లో పాల్గొనరు. అలాగే ఎన్నికల్లో పోటీచేయరు. దేశాధినేతగా, అతను రాజకీయ వ్యవహారాల్లో ఖచ్చితంగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరు పార్లమెంటరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. పార్లమెంటు నుంచి వచ్చే చట్టాలకు ఆమోదముద్ర వేస్తారు. అదే విధంగా ప్రధానమంత్రితో వారానికోసారి సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రజలకే కాదు
బ్రిటీష్ చక్రవర్తి ప్రజలను మాత్రమే పరిపాలించరు. 12వ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్, వేల్స్‌ అంతటా బహిరంగ జలాల్లోని మూగ హంసలు చక్రవర్తి ఆస్తిగా పరిగణించబడుతున్నాయి. వీటితోపాటు బ్రిటీష్ జలాల్లోని స్టర్జన్(ఒక రకం చేప), డాల్ఫిన్లు, తిమింగలాలకు కూడా రాయల్ ప్రత్యేకాధికారం వర్తిస్తుంది.

అధికారిక రచయిత
బ్రిటన్ చక్రవర్తి కోసం పద్యాలను రచించేందుకు ప్రతి 10 సంవత్సరాలకు ఆస్థాన కవిని నియమిస్తారు. ఈ సంప్రదాయం 17వ శతాబ్దం నుంచి వస్తోంది. 2009లో కరోల్ ఆన్ డఫీ రచయితగా నామినేట్ అయిన మొదటి మహిళగా నిలిచారు. ఆమె 2011లో ప్రిన్స్ విలియం వివాహం, 2013లో క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేక 60వ వార్షికోత్సవం, 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కోసం పద్యాలను కంపోజ్ చేశారు.

రాయల్ వారెంట్‌
చక్రవర్తికి వస్తువులు సరఫరా చేసే., సేవలను అందించే కంపెనీలకు రాయల్‌ వారెంట్‌ జారీ చేస్తారు. ఈ వారెంట్ వారికి గొప్ప గౌరవాన్ని అందించడమే కాకుండా అమ్మకాల ప్రోత్సాహనికి ఉపయోగపడుతుంది. వారెంట్ పొందిన కంపెనీలు తమ వస్తువులపై రాజ ఆయుధాలను ఉపయోగించేందుకు అధికారం కలిగి ఉంటాయి. బర్బెర్రీ, క్యాడ్‌బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్‌లు రాయల్ వారెంట్ ఉన్న కంపెనీలలో ఉన్నాయి.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top