
ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఖరీదైన బ్లాక్ లెక్సస్ కారులో వెళ్లి వరద పరిస్థితిని అంచనా వేశారు. దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పోటెత్తిన వరదల పరిస్థితిని అంచనావేసేందుకు కిమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గడిచిన కొన్నిరోజులుగా ఉత్తరకొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వర్షాల ధాటికి వరదలు వచ్చి వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉత్తరకొరియాలో చైనాకు సరిహద్దులో ఉన్న సినాయ్జూ, యిజు అనే పట్టణాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేయడానికి కిమ్ ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లినపుడు నడములోతు నీటిలో ఉన్న బ్లాక్ లెక్సస్ కారు, అందులోని కిమ్ చిత్రాలను స్థానిక మీడియా ప్రచురించింది.
అధ్యక్షుడే దిగివచ్చి నేరుగా వరద సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారని ఆ కథనాల సారాంశం. విమానాలు, హెలికాప్టర్లు ఉండగా కిమ్ కారులోనే ఎందుకు వెళ్లారన్న అంశం చర్చనీయాంశమవుతోంది. తాజాగా విరుచుకుపడ్డ వరదలు ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు భయపడుతున్నారు. ఇక్కడ నీటి పారుదల వ్యవస్థ దారుణంగా ఉండటంతో నష్టం తీవ్రంగానే ఉంటుందని అంచనా.