
ఆఫ్రికన్ దేశం కెన్యాలో పన్నుల పెంపునకు వ్యతిరేకంగా జనం చేపట్టిన నిరసనల్లో 39 మంది మృతి చెందారని జాతీయ హక్కుల పర్యవేక్షణ సంస్థ ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు సరికావని పేర్కొంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం జూన్ 18 నుండి జూలై ఒకటి వరకు జరిగిన నిరసనల్లో 627 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు జాతీయ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. నిరసనకారులు పార్లమెంట్ కాంప్లెక్స్‌ను ధ్వంసం చేసిన సందర్భంగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాగా ప్రెసిడెంట్ విలియం రూటో సెప్టెంబరు 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఏదో ఒక పేరుతో నిరసనలు కొనసాగుతున్నాయి.
ప్రెసిడెంట్ రూటో ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ నిరసనల్లో 19 మంది మృతి చెందారన్నారు. ఈ మరణాలపై దర్యాప్తు చేపడతామన్నారు. కాగా నిరసనకారులు, వైద్య సిబ్బంది, న్యాయవాదులు, జర్నలిస్టులపై చేపడుతున్న బలవంతపు చర్యలపై మానవ హక్కుల సంఘం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.