ఆ పోరులో మాతో కలిసి రండి.. జీ-7కు ప్రధాని మోదీ పిలుపు

Join With India Dedication To Climate Commitments Calls PM Modi To G7 - Sakshi

ఎల్మౌ (జర్మనీ): పర్యావరణ పరిరక్షణకు, తత్సంబంధిత వాగ్దానాలకు భారత్‌ పూర్తిగా కట్టుబడిందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కొన్నేళ్లుగా భారత్‌ కనబరుస్తున్న పనితీరే అందుకు నిదర్శనమన్నారు. వాతావరణ మార్పులపై పోరులో సంపన్న జీ7 దేశాలు కూడా భారత్‌తో కలిసి వస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. స్వచ్ఛ ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి భారత్‌లో అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని వాటికి పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఇక్కడ జీ7 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ మార్పులు, ఇంధనం తదితరాలపై జరిగిన భేటీలో మాట్లాడారు. ఇంధన సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని గడువుకు 9 ఏళ్ల ముందే సాధించామన్నారు. ‘‘పేద దేశాలు పర్యావరణానికి బాగా హాని చేస్తున్నారన్న అపోహను దూరం చేయడంలో భారత్‌ చిత్తశుద్ధి ఇతర వర్ధమాన దేశాలకూ స్ఫూర్తిగా నిలుస్తుంది.

ప్రపంచ జనాభాలో 17 శాతానికి భారత్‌ నిలయం. కానీ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో దేశ వాటా కేవలం 5 శాతం. ప్రకృతితో కలిసి సాగే మా జీవన విధానమే ఇందుకు ప్రధాన కారణం’’ అన్నారు. ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణిలో జీ7 వేదికైన ఎల్మౌలో సోమవారం మోదీకి జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ ఘనస్వాగతం పలికారు. అనంతరం అధినేతల ఫొటో సెషన్‌ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మోదీ వద్దకు స్వయంగా వచ్చి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తదితరులు కూడా మోదీతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతూ కన్పించారు. కెనడా పీఎం జస్టిన్‌ ట్రూడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామాఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ తదితరులతో మోదీ భేటీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సదస్సులో జి7 దేశాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, కెనడా, జపాన్‌తో పాటు భారత్, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, సెనెగల్, అర్జెంటీనా దేశాధినేతలు పాల్గొన్నారు. 


ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఛాయ్‌ పే చర్చలో ప్రధాని మోదీ

ఉక్రెయిన్‌కు జీ7 బాసట 
రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని జి7 దేశాధినేతలు ప్రతినబూనారు. యుద్ధం కాలంలో, తర్వాత కూడా మద్దతిస్తూనే ఉంటామన్నారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేనందున తమకు సాయంపై పశ్చిమ దేశాలు వెనుకంజ వేస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని జి7 దేశాధినేతలు కొట్టిపారేశారు. రష్యా నుంచి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచాలని నిర్ణయించారు.

ఉక్రెయిన్‌కు నానామ్స్‌ సిస్టమ్‌ 
అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ ‘నాసమ్స్‌’ను ఉక్రెయిన్‌ అందించాలని అమెరికా నిర్ణయించింది. కౌంటర్‌–బ్యాటరీ రాడార్లు కూడా ఇవ్వనుంది. 7.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయమూ అందజేస్తామని బైడెన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి జి7 సహకారం కొనసాగిస్తూనే ఉండాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top