ఆసియన్‌ అమెరికన్లకి బైడెన్‌ అండ

Joe Biden meets with Asian American leaders in Atlanta - Sakshi

దాడులపై మౌనం వీడాలని అమెరికన్లకి పిలుపు 

అట్లాంటా ఆసియా అమెరికన్‌ ప్రజాప్రతినిధులతో బైడెన్, కమల సమావేశం

అట్లాంటా: ఆసియన్‌ అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక దాడులు మనసుని కలిచి వేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులపై అమెరికన్లు అందరూ మౌనం వీడాలని పిలుపునిచ్చారు. అట్లాంటాలోని ఆసియా మసాజ్‌ పార్లర్లపై శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మరణించడంతో అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు అట్లాంటా పర్యటనకు వచ్చారు. ఎమొరి యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడన్‌ జాతి వివక్ష దాడులైనా, విదేశీయులంటే భయంతో కూడిన దాడులైనా ప్రజలందరూ మాట్లాడాలని, ప్రతిస్పందించాలని అన్నారు. ‘‘మౌనం వహించడం అన్నది అత్యంత సంక్లిష్టమైనది. మనం అలా ఉండకూడదు’’అని హితవు పలికారు.

అంతకు ముందు ఆసియన్‌ అమెరికన్‌ ప్రజాప్రతినిధులతో బైడెన్, కమలా హ్యారిస్‌లు సమావేశమై చర్చించారు. ఆసియన్‌ అమెరికన్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆసియన్‌ అమెరికన్లలో నెలకొన్న భయభ్రాంతుల్ని చూస్తుంటే గుండె కరిగి నీరైపోతోందన్న బైడెన్‌ అమెరికా పౌరులందరూ విద్వేషాలు వీడాలని అన్నారు. కరోనా సంక్షోభం వచ్చాక ఆసియన్లపై ఓ విధమైన కసితో అమెరికా వ్యాప్తంగా దాడులు అధికమైపోతున్న విషయం తెలిసిందే. ‘‘ఆసియన్లపై దాడి చేస్తున్నారు. నిందిస్తున్నారు. వేధిస్తున్నారు. బలిపశువుల్ని చేస్తున్నారు. మాటలతో తూట్లు పొడుస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. వాళ్లని ఏకంగా చంపేస్తున్నారు’’అని బైడెన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తీసుకురానున్న కోవిడ్‌–19 హేట్‌ క్రైమ్స్‌ యాక్ట్‌కి తాను మద్దతునిస్తున్నట్టుగా బైడెన్‌ ప్రకటించారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే విద్వేషపూరిత నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మరింత చురుగ్గా పనిచేసే వీలు కలుగుతుందని వివరించారు.  

చూస్తూ ఊరుకోం: కమలా హ్యారిస్‌  
అట్లాంటాలో కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ తెలిపారు. జాతి వివక్ష, విదేశీయులంటే భయం అమెరికాలో ఎప్పట్నుంచో ఉన్నాయని అన్నారు. తాను, అధ్యక్షుడు ఈ దాడుల్ని చూస్తూ మౌనంగా ఊరుకోమని హెచ్చరించారు. విద్వేషపూరిత నేరాలు, హింసాత్మక దాడులు, వివక్ష ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ అమెరికన్లుగానే గుర్తించాలని, మనలో ఒకరిగా చూడాలని కమలా హ్యారిస్‌ హితవు పలికారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top