100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా

Joe Biden Announces Vaccination Plan 100 Million In 100 Days - Sakshi

త్వరత్వరగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపడతాం

అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటన

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కొత్త లక్ష్యాలను ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి 100 రోజుల్లో దేశంలోని 100 మిలియన్ల (10కోట్ల) మందికి టీకా అందజేస్తుందని ప్రకటించారు. కోవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్న తమ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు. ఈనెల 20వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బైడెన్‌ డెలావెర్‌లోని, విల్మింగ్టన్‌లో శుక్రవారం తన బృందంతో దేశంలో ఆరోగ్య సంక్షోభంపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. టీకా కార్యక్రమం ఎక్కడ జరుగుతోందో ఇప్పటికీ కచ్చితంగా ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. (చదవండి: ట్రంప్‌నే కాదు, వీళ్లను కూడా పిట్ట పొడిచింది!)

అవసరమైన చోట టీకా సరఫరా లేదు. ఒక పక్క లక్షలాదిమందికి టీకా అవసరం ఉండగా, మరోపక్క లక్షలాదిగా డోసులు దేశవ్యాప్తంగా ఫ్రిజ్‌లలో నిరుపయోగంగా పడి ఉన్న విషయం మాత్రం అందరికీ తెలుసు’అని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని గాడినపెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై తాము చర్చించామన్నారు. ‘దేశంలో సంభవిస్తున్న కోవిడ్‌ మరణాల్లో 80 శాతం వరకు ఉన్న 65 ఏళ్లు పైబడిన వారికి ముందుగా టీకా ఇస్తాం. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రస్తుత వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్‌ సైట్ల సంఖ్యను మరింతగా పెంచుతాం. మోబైల్‌ క్లినిక్‌లను పెంచుతాం. వ్యాక్సినేషన్‌ సాధ్యమైనంత త్వరగా కొనసాగించేందుకు ఔషధ దుకాణాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. సుదూర ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్‌ సైట్లు ప్రారంభిస్తాం. డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ చట్టాన్ని వినియోగించుకుని, ప్రైవేట్‌ ఉత్పత్తి సంస్థల ద్వారా వ్యాక్సినేషన్‌కు అవసరమైన సామగ్రిని ఉత్పత్తిని చేయిస్తాం’అని తెలిపారు. ఉత్పత్తి అయిన డోసుల్లో సగానికి పైగా నిల్వల ఉంచుతూ ట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇందులో చాలా భాగం వ్యాక్సిన్‌ను విడుదల చేసి, మరింత మందికి వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. చదవండి: కోవిడ్‌ అష్టదిగ్భంధం 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top