చైనా-పాక్‌.. వేదాలు వల్లిస్తే.. మరోసారి కశ్మీర్‌పైనే వీళ్ల అక్కసు

Jinping Imran Khan Meet: China Pak Again Comment On Kashmir - Sakshi

గతంలో.. పాక్‌- చైనా సంయుక్త ప్రకటనలో జమ్ము కశ్మీర్ గురించి చేసిన సూచనలను భారతదేశం గట్టిగానే తిరస్కరించింది. జమ్ము కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అందులో అంతర్భాగమని, విడదీయరాని భాగమని నొక్కి చెప్పింది భారత ప్రభుత్వం. అయినా ఈ రెండు దేశాల బుద్ధి మాత్రం మారడం లేదు. పాత పాటే వినిపిస్తున్నాయి. 

తాజాగా ఈ రెండు దేశాలు మరోసారి కశ్మీర్‌ తేనెతుట్టేను కదిలించాయి. వింటర్‌ ఒలింపిక్స్‌ వంకతో చైనా పర్యటనకు వెళ్లిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. వాణిజ్యపరమైన ఒప్పందాలు, చర్చల కోసం మరో నాలుగు రోజులు అక్కడే మకాం వేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సరిహద్దు వివాదం.. అందునా కశ్మీర్‌పై ఇతరుల ఏకపక్ష చర్యల్ని సహించబోమంటూ ప్రకటనలు చేయడం విశేషం.

ఒకవైపు తమ పౌరులపై పాక్‌లో వేర్పాటు వాద సంస్థలు దాడులు చేస్తుండడం, మరోవైపు ఉయిగర్లపై చైనా ఆర్మీ కొనసాగిస్తున్న హింసాకాండపై.. ఈ సమావేశాల్లో రెండు దేశాలు మౌనం వహించాయి. అంతర్జాతీయ సమాజం నుంచి గత కొంతకాలంగా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ఈరెండు దేశాలు ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం.

 

ఇక చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రధాన అంశంగా సాగిన పాక్‌ ప్రధాని పర్యటనలో.. కారిడార్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ తో కలసి పనిచేస్తామని చైనా హామీ ఇచ్చింది. కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా మద్దతునిస్తున్నట్టు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంది. ఏకపక్ష చర్యలు పరిస్థితిని తీవ్రతరం చేస్తాయని, వీటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు పరోక్షంగా భారత్‌పై అక్కసు వెల్లగక్కాయి. శాంతియుత, సౌభాగ్య దక్షిణాసియా అన్నది ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షగా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన నాలుగు రోజుల చైనా పర్యటనలో చివరి రోజు అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలుసుకుని చర్చలు నిర్వహించారు. పాకిస్థాన్ జాతీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, గౌరవం, తీవ్రవాదంపై పోరుకు తమ మద్దతు ఉంటుందని ఇమ్రాన్ తో జిన్ పింగ్ చెప్పినట్టు జిన్హువా న్యూజ్ ఏజెన్సీ పేర్కొనడం కొసమెరుపు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top