
36 మంది దుర్మరణం
దెయిర్ అల్‌బలా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు నానాటికీ ఉధృతమవుతున్నాయి. సోమవారం నాటి దాడుల్లో 46 మంది మృతి చెందారు. దరాజ్ ప్రాంతంలో పునారావస కేంద్రంగా మారిన పాఠశాల భవనంపై జరిగిన దాడిలోనే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 55 మందికి పైగా గాయపడ్డారు. అందులోని వారంతా నిద్రలో ఉండగానే సోమవారం తెల్లవారుజామున మూడుసార్లు దాడులు జరిగాయి. వాటి ధాటికి అంటుకున్న మంటల్లో చాలామంది నిస్సహాయంగా కాలిపోయారు.
ఉగ్రవాదులు పాఠశాల నుంచి పని చేస్తున్నందునే దాన్ని లక్ష్యం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ చెప్పింది. పౌరుల మరణాలకు హమాస్ కారణమని ఆరోపించింది. జాబాలియాలో ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మరణించారు. మరోవైపు గాజాలో మానవతా సహాయాన్ని అమెరికాకు చెందిన సంస్థకు అప్పగించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. సోమవారం నుంచి సహాయం ప్రారంభించింది.