ఉత్తరం నుంచి దక్షిణానికి...వలస వ్యధ! | Sakshi
Sakshi News home page

ఉత్తరం నుంచి దక్షిణానికి...వలస వ్యధ!

Published Sun, Oct 15 2023 5:26 AM

Israel orders evacuation of 1. 1 million people from northern Gaza - Sakshi

జెరుసలేం: ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ చేసిన మతిలేని దాడి సొంత ప్రజలైన పాలస్తీనియన్ల పాలిట భస్మాసుర హస్తంగా మారుతోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ హెచ్చరిలతో ఉత్తర గాజావాసులంతా ఇల్లూ వాకిలీ వీడి పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. వందలో, వేలో కాదు! అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్లగా, ఇజ్రాయెల్‌ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతావారూ అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్‌ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు.

ఇన్ని లక్షల మందీ మరో దారిలేక దక్షిణ గాజా వైపు సాగుతున్నారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలతో పాటు దేనికీ దిక్కులేక కటకటలాడుతున్న దక్షిణ గాజా, అక్కడి జనాభాకు సమాన సంఖ్యలో వచ్చి పడుతున్న తోటి పాలస్తీనియన్లకు ఏ మేరకు ఆశ్రయం కల్పిస్తుందో, ఎలా ఆదుకోగలదో... అంతా అగమ్యగోచరం! ఈ మనకాలపు మహా విషాదానికి ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సమాజం కూడా మౌన ప్రేక్షకురాలిగా మారుతోంది...! పెను ఉత్పాతానికి, మానవ సంక్షోభానికి దారి తీయగల ఈ భారీ వలసలు వద్దంటున్న ఐరాస, అందుకు మరో ప్రత్యామ్నాయమేమీ చూపలేని పరిస్థితుల్లో చేష్టలుడిగింది.

సామూహిక వలసలు...
కార్లు, ట్రక్కులు, గాడిదలు, కాలినడకన... ఎలా వీలైతే అలా ఉత్తర గాజావాసులు వలస బాట పట్టారు. భారమైన మనసులతో ఇల్లూ వాకిలీ ఖాళీ చేసి కుటుంబాలతో సహా తరలి వెళ్తున్నారు. చుట్టూ వచ్చి పడుతున్న బాంబులు, రాకెట్లు, క్షిపణుల మధ్యే బిక్కుబిక్కుమంటూ సాగుతున్నారు. ఎట్టకేలకు దక్షిణ గాజా చేరినా సురక్షితంగా ఉంటామో లేదో తెలియని అయోమయం! తాగడానికి, తినడానికి కూడా దిక్కుండదేమోనన్న భయం!! వెరసి అంతులేని దైన్యమే వారిని వెంటాడుతోంది. మరోవైపు ఎటూ కదల్లేక ఆస్పత్రుల్లో దీనావస్థలో ఉన్న వేలాది మంది క్షతగాత్రులు, రోగులు నిస్సహాయంగా కాలం గడుపుతున్నారు.

ఇజ్రాయెలీల ప్రతీకారేచ్ఛ
హమాస్‌ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కూడా శుక్రవారం రాత్రి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం వారి భావోద్వేగాలను ప్రతిఫలించింది. హమాస్‌ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గాజా ఖాళీ అయ్యాక ఇజ్రాయెల్‌ ఏ స్థాయి దాడులకు దిగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కి భవనాలు, నిర్మాణాలు ఇప్పటికే చాలావరకు ఇజ్రాయెల్‌ రాకెట్‌ దాడుల్లో నేలమట్టమయ్యాయి.

అయితే, అమాయక పాలస్తీనియన్లకు హాని కలగకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి జొనాథన్‌ కొన్రికస్‌ ప్రకటించారు. తక్షణం దక్షిణాదికి వెళ్లిపోవాలంటూ ఉత్తర గాజా అంతటా సైన్యం కరపత్రాలు జారవిడిచింది. సోషల్‌ మీడియాలోనూ విజ్ఞప్తి చేసింది. రెండు ప్రధాన రహదారులపై ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగింటి వరకూ ఎలాంటి హానీ తలపెట్టకుండా వలసలను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే, యుద్ధం ముగిశాక వారు ఉత్తర గాజాకు తిరిగొచ్చేందుకు అనుమతిస్తామన్న హామీని ఇజ్రాయెల్‌ నిలుపుకోవడంపై ఈజిప్ట్‌ తదితర దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.   

అనుమతిస్తాం: ఈజిప్టు
దక్షిణ రఫా సరిహద్దు క్రాసింగ్‌ను తెరిచి ఉత్తర గా జా వాసులను దక్షిణాదికి అనుమతిస్తామని ఈజి ప్టు ప్రకటించింది. గత వారం రోజుల్లో అక్కడ నిర్మించిన తాత్కాలిక గోడలను కూల్చేస్తామని పేర్కొంది. తమవైపు ఇప్పటిదాకా 2,200 మందికి పైగా మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే హమాస్‌ దాదుల్లో మరణించిన ఇజ్రాయెలీల సంఖ్య 1,500 దాటినట్టు ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. వలస వెళ్తున్నవారి కార్లపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు దిగిందని హమాస్‌ ఆరోపించింది.

ఈ దాడులు ఏకంగా 70 మంది అమాయకులను బలిగొన్నాయని పేర్కొ ంది. మరోవైపు ఏ క్షణంలోనైనా హమాస్‌కు ద న్నుగా బరిలో దిగేందుకు సిద్ధమని హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ పునరుద్ఘాటించింది. గాజావాసు ల కోసం ఐరాస పంపిన ఔషధాలు తదితరాల తో కూడిన విమానాలు ఈజిప్టులోనే నిలిచిపోయాయి. పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్‌ దారు ణంగా ప్రవర్తిస్తోందంటూ 57 ఇస్లామిక్‌ దేశాల కూటమి మండిపడింది. వలసలు పూర్తయేందుకు ఇజ్రాయెల్‌ మరింత సమయమివ్వాలని యూరోపియన్‌ యూనియన్‌ సూచించింది.

కళ్లముందు 1948 వలసలు
ప్రస్తుత సంక్షోభం 1948 నాటి పాలస్తీనా వలసలను గుర్తు తెస్తోంది. ఇజ్రాయెల్‌ ఆవిర్భావం సందర్భంగా అరబ్‌ దేశాలతో జరిగిన యుద్ధం సందర్భంగా ఏకంగా 7 లక్షల మంది పాలస్తీనియన్లు ప్రస్తుత ఇజ్రాయెలీ భూభాగాల నుంచి ఇలాగే వలస బాట పట్టారు. దీనినే వారు నక్బా (భారీ ఉత్పాతం)గా పిలుస్తారు. నాటినుంచి వారు ఇప్పటిదాకా తమ స్వస్థలాల ముఖం చూసేందుకు నోచుకోలేదు! వారు, వారి వారసులు కలిపి 60 లక్షల మంది దాకా వెస్ట్‌బ్యాంక్‌తో పాటు లెబనాన్, సిరియా, జోర్డాన్లలో తలదాచుకుంటున్నారు. గాజాలోనూ ఎక్కువ మంది వీరే. నాటి బాధాకరమైన ఉదంతం ఇప్పుడు పునరావృతమవుతోందని వారు ఆక్రోశిస్తున్నారు.

దాడుల్లో హమాస్‌ కమాండర్‌ హతం: ఐడీఎఫ్‌
ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి సారథ్యం వహించిన హమాస్‌ మిలిటెంట్‌ సంస్థకు చెందిన కమాండర్‌ అలీ ఖాదీ హతమయ్యాడు. నక్బా యూనిట్‌ కంపెనీ కమాండర్‌గా ఉన్న అతన్ని కచ్చితమైన సమాచారం మేరకు డ్రోన్‌ దాడిలో మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) శనివారం ప్రకటించింది. 2005లో పలువురు ఇజ్రాయెల్‌ పౌరుల కిడ్నాపింగ్, హత్య కేసుల్లో అలీని అదుపులోకి తీసుకున్నారు. కానీ గిలాత్‌ శాలిద్‌ ఖైదీల మారి్పడి ఒప్పందంలో భాగంగా విడుదల చేయాల్సి వచి్చంది‘ అంటూ ఆ దేశ వైమానిక దళం ట్వీట్‌ చేసింది. హమాస్‌ ఉగ్రవాదులందరికీ అలీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించింది. 

Advertisement
Advertisement