Israel-Hamas war: గాజాలో తీరని వ్యథ | Sakshi
Sakshi News home page

Israel-Hamas war: గాజాలో తీరని వ్యథ

Published Sat, Oct 21 2023 5:19 AM

Israel-Hamas war updates and latest news on Gaza conflict - Sakshi

ఖాన్‌ యూనిస్‌/టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌:  ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య అనూహ్యంగా మొదలైన యుద్ధం సాధారణ పాలస్తీనియన్ల ఉసురు తీస్తోంది. బతికి ఉన్నవారికి కడుపు నిండా అన్నం లేదు, కంటికి నిద్రలేదు. ఆకలి, అగచాట్లే మిగులుతున్నాయి. సేఫ్‌జోన్‌ అని భావించే దక్షిణ గాజాలో కూడా ఇప్పుడు భద్రత లేకుండాపోయింది. ఇజ్రాయెల్‌ సైన్యం ఆదేశాలతో ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వలస వెళ్లిన జనం మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నారు.

దక్షిణ గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు ఉధృతంగా కొనసాగుతుండడమే ఇందుకు కారణం. శుక్రవారం ఇజ్రాయెల్‌ సైన్యం దక్షిణ గాజాపై విరుచుకుపడింది. క్షిపణుల వర్షం కురిపించింది. ప్రధానంగా ఖాన్‌ యూనిస్‌ నగరంలో నష్టం అధికంగా జరిగింది. హమాస్‌కు చెందిన 100కుపైగా టార్గెట్లపై దాడులు చేశామని, మిలిటెంట్ల సొరంగాలు, ఆయుధ డిపోలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం శుక్రవారం 14వ రోజుకు చేరింది. ఇరువైపులా ప్రాణ, ఆస్తి నష్టం పెరుగుతోంది.

ఈ యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు 4,137 మంది మృతిచెందారని, 12,500 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ తెలియజేసింది. మరో 1,300 మంది ఇంకా శిథిలాల కిందే ఉన్నారని, వారు బతికి ఉన్నారో లేదో చెప్పలేమని వెల్లడించింది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ల అధీనంలో 203 మంది బందీలు ఉన్నట్లు గుర్తించామని ఇజ్రాయెల్‌ అధికారులు చెప్పారు.  

గాజాలో సేఫ్‌ జోన్లు లేవు  
తమ లక్ష్యం కేవలం హమాస్‌ మిలిటెంట్లు మాత్రమేనని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గల్లాంట్‌ చెప్పారు. గాజాలో హమాస్‌ గ్రూప్‌ను నిర్మూలించిన తర్వాత సాధారణ ప్రజలను తమ నియంత్రణలోకి తీసుకురావాలన్న ఉద్దేశం ఏదీ లేదని అన్నారు. గాజాలో ఇప్పుడు సేఫ్‌ జోన్లు అంటూ ఏవీ లేవని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి నిర్‌ దినార్‌ చెప్పారు. గాజా అంతటా మిలిటెంట్ల స్థావరాలు, సొరంగాలు ఉన్నాయని, వాటిపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌ సైన్యం ఇప్పుడు దక్షిణ గాజాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో అక్కడ పరిస్థితులు దిగజారుతున్నాయని, జనజీవనం స్తంభించిపోతోందని, ఉత్తర గాజా నుంచి వచి్చనవారు వెనక్కి మళ్లుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం అధికార ప్రతినిధి రవీనా శామ్‌దాసానీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా క్షతగాత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గాజాలోని ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. పరిమితంగా ఉన్న ఔషధాలు ఏ మూలకూ చాలడం లేదు. హాస్పిటళ్లలో కరెంటు లేకపోవడంతో డాక్టర్లు మొబైల్‌ ఫోన్ల వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారు. ఈజిప్టు నుంచి ఔషధాలు, నిత్యావసరాలు దిగుమతి చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నామని గాజా అధికారులు చెప్పారు.   
 
 

క్షిపణులు, డ్రోన్లను కూలి్చవేసిన అమెరికా సైన్యం  
మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద సంస్థలు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తున్నాయి. గురువారం ఇజ్రాయెల్‌ దిశగా దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను ఉత్తర ఎర్ర సముద్రంలోని తమ యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ కార్నీ కూల్చివేసిందని అమెరికా సైన్యం వెల్లడించింది. యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాద శక్తులు ఈ ఆయుధాలను ప్రయోగించాయని ఆరోపించింది. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా నుంచి జరిగిన తొలి ప్రతిదాడి ఇదే కావడం గమనార్హం.   

హమాస్‌ అగ్రనేత హసన్‌ యూసఫ్‌ అరెస్టు
హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ అధికార ప్రతినిధి హసన్‌ యూసఫ్‌ను గురువారం వెస్ట్‌బ్యాంక్‌లో అరెస్టు చేసినట్లు ఇజ్రాయెల్‌ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లో నిర్వహించిన దాడుల్లో హమాస్‌కు చెందిన 60 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేసింది. హమాస్‌ కోసం హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై హసన్‌ యూసఫ్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. హసన్‌ యూసఫ్‌ పాలస్తీనాలో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం హవ ూస్‌ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. వెస్ట్‌బ్యాంక్‌ చట్టసభలో సభ్యుడుగా వ్యవహరిస్తున్నాడు. హసన్‌ యూసఫ్‌ గతంలో 24 ఏళ్లు జైల్లో ఉన్నాడు. అంతర్జాతీయ మీడియాలో హమాస్‌ ప్రతినిధిగా ప్రముఖంగా కనిపించేవాడు.   

ఇజ్రాయెలీలకు వీసా లేకుండా అమెరికా యానం
ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం చాలారోజులు కొనసాగే అవకాశం ఉండడంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ ప్రజల కోసం వీసా రద్దు పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఇజ్రాయెలీలు వీసాకు దరఖాస్తు చేసుకోకుండానే అమెరికాకు చేరుకొని, 90 రోజులపాటు ఇక్కడ నివసించవచ్చు. ఈ పథకం గురువారం నుంచే అమల్లోకి వచి్చందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రకటించింది.

డ్రగ్స్‌ మత్తులో ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ల దాడి!  
హమాస్‌ మిలిటెంట్లు ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. వారు ఆ సమయంలో మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నారని ‘ద జెరూసలేం పోస్టు’ పత్రిక వెల్లడించింది. కాప్టాగాన్‌ అనే డ్రగ్స్‌ మాత్రలు తీసుకున్నారని, ఒళ్లు తెలియని స్థితిలో రెచి్చపోయారని, సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పేర్కొంది. ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన ఎదురుదాడిలో పలువురు మిలిటెంట్లు మరణించారు. మృతదేహాలను సోదా చేయగా కాప్టాగాన్‌ డ్రగ్స్‌ మాత్రలు లభించాయని ఆ పత్రిక వివరించింది. హమాస్‌ నాయకత్వమే మిలిటెంట్లకు ఈ మాత్రలు ఇచి్చనట్లు తెలిపింది. కాప్టాగాన్‌ను పేదల కొకైన్‌గా పిలుస్తుంటారు. అన్నం దొరకని సందర్భాల్లో ఆకలి వేయకుండా, మత్తులో మునిగి ధైర్యం పొందడం కోసం కాప్టాగాన్‌ తీసుకుంటూ ఉంటారు.   

ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌ విజయం అమెరికాకు రక్ష: బైడెన్‌   
ప్రత్యర్థులతో ప్రస్తుతం సాగిస్తున్న యుద్ధాల్లో ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌ దేశాలు విజయం సాధించాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌ల విజయం అమెరికా జాతీయ భద్రతకు చాలా కీలకమని అన్నారు. ఆయన గురువారం రాత్రి శ్వేతసౌధంలోని ఓవల్‌ ఆఫీసు నుంచి అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. సైనిక సాయం కింద ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌తోపాటు తైవాన్‌కు బిలియన్ల డాలర్లు ఇవ్వాలని, అందుకోసం మనం సిద్ధం కావాలని సూచించారు. నిధుల మంజూరు కోసం కాంగ్రెస్‌ను విజ్ఞప్తి చేశానని, రాబోయే ఏడాది వ్యవధిలో 100 బిలియన్‌ డాలర్లు కావాలని చెప్పారు.  ఇదొక తెలివైన పెట్టుబడి అవుతుందని, దీనివల్ల అమెరికాలో భవిష్యత్తు తరాలకు భద్రమైన జీవితం లభిస్తుందని, అదే మనకు లభించే సత్ఫలితమని స్పష్టం చేశారు.

స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు కావాలి: సౌదీ యువరాజు  
1967 నాటి సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌  అన్నారు. శుక్రవారం జీసీసీ, ఆసియాన్‌ ఉమ్మడి శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. గాజాలో హింసాకాండ, అమాయక ప్రజల మరణంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ పౌరులపై దాడులను ఖండిస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement