ఇరాక్‌ పార్లమెంట్‌లో నిరసనకారుల హల్‌చల్‌.. ఇరాన్‌కు శాపనార్థాలు పెడుతూ..

Iraq Crisis: Protesters Enter Parliament chant curses against Iran - Sakshi

బాగ్దాద్‌: నిరసనకారుల రంగప్రవేశంతో ఇరాక్‌ పార్లమెంట్‌ భవనం దద్దరిల్లిపోయింది. ఇరాన్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు నిరసనకారులు. భవనంలోని ప్రతీ గదిలోకి దూసుకెళ్లి.. ఇరాకీ జెండాలతో రచ్చ రచ్చ చేశారు. ఇరాక్‌ రాజకీయ-ఆర్థిక సంక్షోభాలను కారణాలుగా చూపిస్తూ.. మాజీ మిలిటెంట్‌, ప్రస్తుత మతపెద్ద మోఖ్వాతదా సద్ర్‌ మద్దతుదారులు ఈ చేష్టలకు దిగారు. 

ఇరాక్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు ఏడాది కావస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ క్రమంలో.. కోఆర్డినేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ బ్లాక్‌ తరపున మహ్మద్‌ అల్‌-సుడానీ అధికారికంగా ప్రధాని పదవికి నామినేషన్‌ వేయడానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ఇరాకీ మతపెద్ద, ఇరాకీ షీతే నిర్వాహకుడు మోఖ్వాతదా సద్ర్‌కు చెందిన మద్దతుదారులు వందల మంది ఒక్కసారిగా పార్లమెంట్‌లోకి దూసుకొచ్చారు. 

హై సెక్యూరిటీ జోన్‌ దాటుకుని..
అల్‌-సుడానీ నామినేషన్‌ సంగతి తెలుసుకున్న మోఖ్వాతదా మద్దతుదారులు.. పార్లమెంట్‌ భవనం వైపు దూసుకొచ్చారు. రాజధాని బాగ్దాద్‌లో ఉన్న హై సెక్యూరిటీగా పేర్కొనే గ్రీన్‌ జోన్‌ను దాటుకుని.. ముందుకొచ్చారు. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించినా లాభం లేకుండా పోయింది. ఇక పార్లమెంట్‌ భవనం వద్ద ఆ టైంలో కొద్దిమంది మాత్రమే సెక్యూరిటీ గార్డులు ఉండగా.. వాళ్లు భయంతో ప్రతిఘటించకుండా నిరసనకారుల్ని లోపలికి అనుమతించారు.  

బెంచ్‌ల ఎక్కి..
పార్లమెంట్‌ భవనంలో టేబుళ్ల మీద నడుస్తూ.. నానా రభస సృష్టించారు నిరసనకారులు. ఇరాన్‌కు శాపనార్థాలు పెడుతూ.. ఇరాకీ జెండాలు ప్రదర్శించారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు నిరసనకారులు.  రాజకీయంగానే కాదు.. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలోనూ ఇరాక్‌ లాంటి చమురు ఆధారిత దేశం ఆర్థికంగా దిగజారిపోతోందని నిరసనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో.. ఇరాన్‌ అనుకూల వ్యక్తి ప్రధాని పదవి చేపట్టేందుకు తాము ఒప్పుకోబోమని అంటున్నారు. ఇక నిరసకారులు తక్షణమే బయటకు వచ్చేయాలంటూ ప్రధాని ముస్తఫా అల్‌-కధెమి పిలుపు ఇచ్చారు. దౌత్యపరమైన ఇబ్బందులూ తలెత్తే అవకాశం ఉంటుందని, అది గమనించాలని నిరసనకారులకు పిలుపు ఇచ్చాడు ఆయన. 

రాజకీయ సంక్షోభం
మాజీ ఉగ్రవాది, ఇరాకీ మతపెద్ద మోఖ్వాతదా సద్ర్‌కు చెందిన విభాగం.. 2021 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 329 సీట్లకుగానూ 73 స్థానాలు గెల్చుకుంది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నామినేషన్‌ వేయడానికి వెళ్లిన మహ్మద్‌ అల్‌-సుడానీ మాజీ మంత్రి, మాజీ గవర్నర్‌ కూడా. అయితే.. ఆయన ఇరాన్‌ అనుకూల వ్యక్తి అని, అక్కడి పార్టీల మద్దతు కూడా ఉందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. 

అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒత్తిడి పెంచే క్రమంలో సద్ర్‌ తీసుకున్న ఓ నిర్ణయం బెడిసి కొట్టింది. తన బ్లాక్‌కు చెందిన 73 మంది చట్ట సభ్యులు రాజీనామా చేశారు. దీంతో 63 మంది కొత్త చట్ట సభ్యులు మొన్న జూన్‌లో ప్రమాణం చేయగా.. ఇరాన్‌ అనుకూల ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top