పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌.. అన్నదమ్ముల్లా కలిసి ఉండండి: ఖమేనీ పిలుపు | Iran's New Leader Offers Mediation In Taliban-Pakistan Conflict | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌.. అన్నదమ్ముల్లా కలిసి ఉండండి: ఖమేనీ పిలుపు

Mar 20 2026 11:31 PM | Updated on Mar 20 2026 11:31 PM

Iran's New Leader Offers Mediation In Taliban-Pakistan Conflict

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో నలిగిపోతున్న ఇరాన్‌.. పక్క దేశాల పంచాయితీని చక్కబెడతానని ముందుకొచ్చింది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ 1405వ పర్షియన్‌ నూతన సంవత్సరం "నౌరూజ్‌" సందర్భంగా ఇచ్చిన సందేశంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.

మా తూర్పు దేశాలు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మాకు అత్యంత సన్నిహితమైనవి.. ఇరు దేశాలు సోదరుల్లా మెలగండి.. ముస్లింల ఐక్యత కోసం పరస్పర సంబంధాలను మెరుగుపర్చుకోండి.. అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. 

మొజ్తబా ఖమేనీ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయ్యాక పాక్‌-ఆఫ్ఘన్‌ ఘర్షణలపై చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలు ఇవి. ఇటీవలికాలంలో ఇరాన్ విదేశాంగ మంత్రి పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించినా, కాబూల్–ఇస్లామాబాద్‌వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.  

కాగా, గతకొంతకాలంగా పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య అనధికారిక య్దుదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్‌ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్‌ ప్రకటించింది.

అయితే పాక్‌ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే,  సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఈద్ అల్-ఫితర్ సందర్భంగా తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించాయి.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement