టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాల్లో అధికంగా లభించే సహజ వనరులు అయిన ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్)తో పాటు ఇతర ఇంధన వనరుల నౌకలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లొచ్చని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.
శనివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటన చేస్తూ.. ‘ఇరాన్ 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలి. లేదంటే ఇరాన్ అణు కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తాం. పెద్ద దానితో మొదలు పెట్టి గట్టిగా ముగిస్తాం” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చలకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి స్పందించారు.‘ఇరాన్ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప మిగతా అన్ని నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. మేము సముద్ర భద్రతను మెరుగుపరచడానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈ ప్రకటనతో ఇరాన్ ప్రత్యక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమైంది.
ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి చేసిన ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్ ప్రాంతంలో అధికంగా లభించే ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్) వంటి ఇంధన వనరుల సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలసంధి తెరవబడటం వల్ల చమురు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు కొంతవరకు తగ్గాయి. ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామం ఇతర దేశాలకు శుభపరిణామంగా భావించబడుతోంది, ఎందుకంటే ఇంధన సరఫరా కొనసాగడం వారి ఆర్థిక వ్యవస్థలకు ఊరటనిస్తుంది.


