రిషి సునాక్ గెలుపు కోసం.. ప్రవాసుల ప్రయత్నాలు

Indian Diaspora in UK Organises Havan For Rishi Sunak Victory - Sakshi

లండన్‌: బ్రిటన్‌ నూతన ప్రధాని ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరువవుతోంది. రిషి సునాక్, లిజ్‌ ట్రస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరు ప్రధానికి అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. రిషి సునాక్‌ ప్రధాని పదవిని అధిష్టించాలని యూకేలోని ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. రిషి సునాక్ వెనకబడ్డారని సర్వేలు వెల్లడించడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 


రిషి సునాక్‌ సమర్థుడు కాబట్టే బ్రిటన్‌కు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నామని ప్రవాస భారతీయులు అంటున్నారు. ‘భారతీయ మూలాలు కలిగివున్నారు కాబట్టే మేము ఆయన కోసం ప్రార్థించడం లేదు. జీవన వ్యయ సంక్షోభం నుంచి మమ్మల్ని బయటపడేసే సమర్థత ఆయనకు ఉందని నమ్ముతున్నాం కాబట్టే రిషి విజయం సాధించాలని కోరుకుంటున్నామ’ని బ్రిటిష్ ఇండియన్ సీకే నాయుడు తెలిపారు. 


ప్రధాని పదవికి ప్రస్తుతం రిషి సునాక్‌ ఉత్తమ అభ్యర్థి అని ప్రవాస భారతీయురాలు షీలమ్మ పేర్కొన్నారు. పాలనా వ్యవహారాలతో పాటు ప్రతి విషయంలోనూ రిషి ఎంతో హుందాగా వ్యవహరించారని, ఆయన గెలవాలని తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, బ్రిటన్‌ తదుపరి ప్రధాని ఎవరనేది సెప్టెంబర్‌ 5న తేలుతుంది. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట)


బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూకే మొత్తం జనాభాలో 2.5 శాతంగా ఉన్న ప్రవాసులు జీడీపీలో దాదాపు 6 శాతం వాటా కలిగివున్నారు. గ్రాంట్ థోర్న్‌టన్ వార్షిక ట్రాకర్ 2022 ప్రకారం గత సంవత్సరంతో పోల్చితే భారతీయ కంపెనీల సంఖ్య 805 నుంచి 900కి పెరిగింది. వీటి ద్వారా వచ్చే రాబడి 50.8 బిలియన్ల ఫౌండ్ల నుంచి 54.4 బిలియన్‌ ఫౌండ్లకు చేరుకుంది. ఇండియన్‌ డయాస్పోరా విజయాల్లో రిషి సునాక్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే తమకు మరింత మేలు జరుగుతుందని ప్రవాసులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్: రిషి సునాక్‌కు అనూహ్య మద్దతు.. అవాక్కయిన యాంకర్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top