సైబర్ బాధిత దేశాల్లో రెండో స్థానంలో భారత్
ఏఐని ఆయుధంగా మలుచుకుంటున్న నేరస్తులు.. కృత్రిమ మేధ సాయంతో కొత్త తరహా నేరాలకు శ్రీకారం
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్‌లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.
వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్‌లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
కోట్లాది ఖాతాలకు చెక్..
కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్‌బుక్, ఇన్‌స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్‌బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది.
కొత్త తరహా మోసాలు..
ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్‌వర్క్‌లను పరిశోధకులు కనుగొన్నారు.
మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్‌స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.
సులభంగా నేరాలు..
భారత్‌లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.
ఏఐ ఆధారిత యాప్స్‌తో..
వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్‌ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్‌సైట్స్‌ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్‌ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్‌కు, మార్చిన కంటెంట్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు.
వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్‌ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.
ఆగ్నేయాసియా నుంచి..
భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్‌వర్క్‌లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది.


