ప్చ్‌.. పాకిస్తాన్‌ పీత కష్టాలు | India Op Sindoor Effect: Pak Still Struggles To Open Air Bases | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. పాకిస్తాన్‌ పీత కష్టాలు

Jun 19 2025 6:55 PM | Updated on Jun 19 2025 7:53 PM

India Op Sindoor Effect: Pak Still Struggles To Open Air Bases

ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్‌ సూపర్‌ సక్సెస్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ అట్టర్‌ ప్లాప్‌ అని డప్పు కొట్టి ప్రకటించుకున్నా పాక్‌ను పట్టించుకునే నాథుడే(దేశం)కరువయ్యాడు. పైగా 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు డామియన్ సైమన్ పాక్‌ పాలిట పీడకలగా తయారయ్యాడు.

భారత సైన్యం అసలు తమ ఎయిర్‌బేస్‌లపై దాడులే జరపలేదని పాక్‌ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే.  ఆపరేషన్‌ సిందూర్‌లో మురిద్‌, జాకోబాబాద్‌, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్‌బేస్‌లను టార్పలిన్‌(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్‌. ఈ విషయాన్ని బయటపెట్టిన డామియన్‌.. ఇప్పుడు మరో కీలక సమాచారాన్ని ఎక్స్‌ వేదికగా వదిలాడు. అందులో రహీం యార్‌ ఖాన్‌ బేస్‌ను పాక్‌ ఎంతకీ పునరుద్ధరించలేకపోతోందని వెల్లడించాడు.

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా ఫేజ్‌1లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. ఫేజ్‌2లో రహీమ్‌ యార్‌ ఖాన్‌ బేస్‌ను సైతం దెబ్బ తీసింది. అయితే జులై 4వ తేదీ దాకా దాని కార్యకలాపాలు ప్రారంభం కాబోవని పాక్‌ సైన్యం తాజాగా నోటామ్‌(notice to airmen) సైతం జారీ చేసింది.

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా.. పక్కా ప్రణాళికతో భారత్‌ ఈ ఎయిర్‌బేస్‌ను దెబ్బ తీసింది. దీంతో పాకిస్తాన్‌కు జరిగిన నష్టం మాములిది కాదు. పంజాబ్‌ ప్రావిన్స్‌లో పాక్‌కు ఇదే వ్యూహాత్మక స్థావరంగా ఉండేది. అంతేకాదు.. ఈ ఎయిర్‌బేస్‌కు అనుసంధానంగా రహీమ్‌ యార్‌ ఖాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఒకే రన్‌వే ఉన్న ఈ ఎయిర్‌పోర్టును భారత్‌ జరిపిన దాడి తర్వాత వారం పాటు మూసే ఉంచుతామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే అది కూడా ఇప్పటిదాకా తెరుచుకోకపోవడం గమనార్హం. దీంతో.. దాడి ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ‘‘అది ఇంకెప్పటికి తెరుచుకుంటుందో?’’ అంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

విశేషం ఏంటంటే.. రాజస్థాన్‌ బికనీర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్‌బేస్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాక్‌ రహీమ్‌ యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ ఇంకా ఐసీయూలోనే ఉంది. అది ఎప్పటికీ తిరిగి తెరుచుకుంటోందో కూడా చెప్పలేకపోతున్నారు అని మోదీ తన ప్రసంగంలో వ్యంగ్యం ప్రదర్శించారు. 

📍రహీం యార్ ఖాన్ (Rahim Yar Khan) పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక ప్రముఖ నగరం(జిల్లా కేంద్రం కూడా).  ఇది పాకిస్తాన్‌లో 21వ అతిపెద్ద నగరం. ఈ నగరం పూర్వపు పేరు నౌషెహ్రా. అయితే 1881లో బహావల్పూర్ రాష్ట్ర నవాబ్ సాదిక్ ఖాన్ IV.. తన కుమారుడు రహీం యార్ ఖాన్ (1877–1881) పేరును ఈ నగరానికి పెట్టాడు. ఈ ప్రాంతంలో పట్టన్ మినారా అనే 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ స్థూపం ఉంది, ఇది మౌర్యుల హక్రా లోయ నాగరికతకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement