OP Sindoor: పాక్ ఎయిర్‌బేస్‌పై భారత్‌ గట్టి దెబ్బ | See How India Destroy Pakistan Murid Air Base During Operation Sindoor, Satellite Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Operation Sindoor: పాక్ ఎయిర్‌బేస్‌పై భారత్‌ గట్టి దెబ్బ

May 28 2025 10:06 AM | Updated on May 28 2025 1:44 PM

OP Sindoor: How India Destroy Pak Murid Air Base Satellite Pics Viral

పహల్గాం దాడికి ప్రతీకారంగా.. ఉగ్ర శిబిరాల నాశనమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించి తాజాగా మరికొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో పాకిస్థాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి.

తాజా శాటిలైట్‌ ఫొటోల ప్రకారం.. మురిద్ ఎయిర్‌బేస్‌(Murid Airbase) లోని ఒక కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై భారత వైమానిక దళం కచ్చితమైన దాడి జరిపింది. అందులో ఆ భవనం దెబ్బతిన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘భవనం పైకప్పులోని ఒక భాగం కూలిపోయింది. తద్వారా బిల్డింగ్‌ లోపల కూడా నష్టం జరిగే అవకాశం లేకపోలేదు’’ జియో ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మే 23న తీసిన ఈ చిత్రాలను 'ది ఇంటెల్ ల్యాబ్'కు డామియన్ సైమన్ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

 

ఏప్రిల్‌ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో.. జమ్ము కశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్‌ లోయలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు(Pahalgam Terror Attack). ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ‘‘ఆపరేషన్ సిందూర్’’ను భారత్ ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత దళాలు దాడులు చేసి నాశనం చేశాయి.

మురిద్‌ కీలకమే
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత సాయుధ దళాలు పాక్‌ పంజాబ్‌లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, చునియన్‌తో పాటు సుక్కూర్‌లోని వైమానిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. ఇందులో మురిద్ వైమానిక స్థావరం, భారత్‌తో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు ఎంతో కీలకమైనది. ఇక్కడ అనేక అత్యాధునిక ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లు మోహరించి ఉన్నాయి. ఈ స్థావరంలో పాకిస్థాన్‌కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్‌తార్ టీబీ2ఎస్, బేరక్‌తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ దాడి పాకిస్థాన్ సైనిక సామర్థ్యానికి గట్టి దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక.. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భారత నగరాలపై పాకిస్థాన్ రెచ్చగొట్టే దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర స్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. మే 12న కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో.. భారత్‌ దౌత్య యుద్ధం ప్రారంభించింది. పాక్‌ సీమాంతర ఉగ్రవాదంపై పోరును ప్రపంచదేశాలకు తెలియజేసేందుకు ప్రత్యేక బృందాలను విదేశాలకు పంపింది.

మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్‌
భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్‌ రేంజ్‌కు వెళ్లారు. అక్కడ దేశీయంగా రూపొందించిన మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించారు.  శత్రు దేశాలు ప్రయోగించే మానవ రహిత వైమానిక వ్యవస్థను అడ్డుకోవడానికి సరికొత్త డ్రోన్లు, ఆయుధాలను భారత్ రూపొందించింది.

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement