ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్‌ జాబ్‌ కొట్టాడు | UP Father And Son Selected Constable Job Viral Story Details | Sakshi
Sakshi News home page

ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్‌ జాబ్‌ కొట్టాడు

Jun 18 2025 2:32 PM | Updated on Jun 18 2025 2:33 PM

UP Father And Son Selected Constable Job Viral Story Details

అతనికి పోలీస్‌ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్‌ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 

ఉత్తర ప్రదేశ్‌లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్‌లో) 60 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది. ఆ పరీక్షలో యశ్‌పాల్‌ అనే రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్‌లో ఆయన కొడుకు శేఖర్‌(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్‌. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.

యశ్‌పాల్‌ స్వస్థలం హపూర్‌ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్‌పూర్‌ ఉదయ్‌రాంపూర్‌ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్‌ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యాడు. రెండు అటెంప్ట్‌లలో జాబ్‌ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్‌ తర్వాత వలంటీర్‌ రిటైర్‌మెంట్‌ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌లో పని చేస్తూ వచ్చారు. 

ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ విడుదలదైంది. అప్పటికి ఇంటర్‌ పూర్తి చేసిన యశ్‌ పాల్‌ పెద్ద కొడుకు శేఖర్‌ ఈ పరీక్షకు ప్రిపేర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్‌ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్‌ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్‌పాల్‌ భావించాడు. 

మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్‌ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్‌ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్‌పాల్‌కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్‌ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృ‍త్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్‌, న్యూమరికల్‌ రీజనింగ్‌ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యారు. లోకల్‌గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్‌తో.. యూపీ కానిస్టేబుల్‌ పరీక్షతో పాటు సీడీఎస్‌, ఎస్సై ఎగ్జామ్‌లు కూడా రాశారు. 

2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్‌లీక్‌ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్‌ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్‌ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్‌ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. 

లక్నోలో తాజాగా(జూన్‌ 15వ తేదీన) జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో అమిత్‌షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్‌జహాన్‌పూర్‌కు యశ్‌పాల్‌, బరేలీకి శేఖర్‌ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్‌పాల్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement