లాడెన్‌ను అంత తేలికగా మరిచిపోయారా? | Shashi Tharoor Satirical Comments On Donald Trump Lunch With Pakistan's Asim Munir, Watch Video Inside | Sakshi
Sakshi News home page

లాడెన్‌ను అంత తేలికగా మరిచిపోయారా?

Jun 19 2025 5:07 PM | Updated on Jun 19 2025 5:47 PM

Shashi Tharoor Satires On Donald Trump Asim Munir Lunch

పహల్గాం ఘటన తర్వాత.. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తన మధ్యవర్తిత్వంతోనే చల్లారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న మ్యాటర్‌ తెలిసిందే. అంతేకాదు.. అందుకు సహకరించారంటూ పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ను వైట్‌హౌజ్‌కు ఆహ్వానించి మరీ భోజనం పెట్టారు. ఈ పరిణామంపై తిరువనంతపురం(కేరళ) కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యంగ్యంగా స్పందించారు.

‘‘పాకిస్తాన్ అనేది గతంలో ఒసామా బిన్ లాడెన్‌ను తమ సైనిక శిబిరం సమీపంలో దాచిన దేశం. అలాంటి దేశానికి చెందిన సైన్యాధిపతికి అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యమివ్వడం విడ్డూరం. ఈ పరిణామం..  బహుశా అమెరికా ప్రజలు ఒసామాను మరిచిపోయారా? అనే సందేహాన్ని కలిగిస్తోంది’’ అని థరూర్‌ వ్యాఖ్యానించారు. 

.. పాక్‌ ప్రతినిధి బృందాన్ని కలిసిన కొంతమంది అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్లు ఉన్నారు. కానీ ఒసామా బిన్ లాడెన్ అనే పేరును అమెరికన్లు అంత త్వరగా మరచిపోయి ఉండరని నేను అనుకోను. ఇది అమెరికన్లకు అంత సులభంగా మరిచిపోలిగిన విషయమైతే కాదు. పాక్ లాడెన్‌ను తన ఆర్మీ శిబిరం దగ్గర దాచిన విషయంలో బాధ్యత వహించాల్సిందే.  వారు(పాక్‌) అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడికి కారణమైన వ్యక్తిని రహస్యంగా దాచారు. పైగా భారత్‌పై ఉగ్రదాడులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు.

.. కనీసం ఈ సమావేశాన్ని ఉపయోగించుకుని అయినా అమెరికా అధ్యక్షుడు  ట్రంప్.. పాక్ ఆర్మీ చీఫ్‌ను హెచ్చరించి ఉండాలి. వాళ్ల దేశం నుంచి ఉగ్రవాదులను ఆర్థికంగా, సాయుధంగా, శిక్షణ ఇచ్చి మరీ భారత్‌కు పంపడం మంచిది కాదని చెప్పి ఉండాలి. మందు, విందుతో పాటు పాక్‌ ఆర్మీ చీఫ్‌కు అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్లు ఈ విషయాలన్నీ చెప్పి ఉండాలి.   ఎందుకంటే ఇదంతా అమెరికా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కూడా’’ అని థరూర్‌ ఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత.. పాక్‌ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో తెలియజేసేందుకు ఎంపీల అఖిల పక్ష బృందాలను పలు దేశాలకు కేంద్రం పంపుతోంది. అందులో శశిథరూర్‌ కూడా ఉన్నారు.

2001 సెప్టెంబర్‌ 11వ తేదీన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్స్‌పై ఉగ్రదాడి జరిగి 3 వేల మందికిపైగా మరణించారు. ఈ దాడుల వెనుక ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలోని అల్‌ ఖైదా ఉందని తేలింది.  పదేళ్ల తర్వాత..  2011, మే 2వ తేదీన అమెరికా నేవీ సీల్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్ అనే పట్టణంలో నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో లాడెన్‌ను హతమార్చాయి. ఇందుకోసం జరిపిన ఆపరేషన్‌కు Operation Neptune Spear అనే కోడ్ పేరు పెట్టారు.  అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ఈ దాడిని పర్యవేక్షించారు. 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే తానే చెబితేనే  యుద్ధం ఆగిందని ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ల చొరవతోనే ఇది సాధ్యమైందని చెబుతూ ఇద్దరినీ వైట్‌హౌజ్‌ లంచ్‌ ఈవెంట్‌కు ఆహ్వానించారు. అసిమ్‌ మునీర్‌ అప్పటికే అమెరికా చేరుకోగా.. జీ7 సదస్సుకు హాజరైన మోదీతో ట్రంప్‌ ఫోన్‌లో 35 నిమిషాలపాటు సంభాషించారు. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన మోదీ.. ట్రంప్‌ మధ్యవర్తిత్వం చేశారన్న ప్రకటనను తోసిపుచ్చారు. పాక్‌ ఆర్మీ బతిమాలినందు వల్లే ఆపరేషన్‌ సిందూర్‌ ఆగిపోయిందని,  భారత్‌-పాక్‌ దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరగలేదని.. ఇక మీదటా జరగబోదని ట్రంప్‌తో స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement