
న్యూఢిల్లీ: భారత వస్తువులపై 25 శాతం సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా సీరియస్‌గా పరిగణించాల్సి ఉందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. అది అమెరికాతో ఉన్న భారత వాణిజ్య ఒప్పందాన్ని విధ్వంసం, విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందన్నారు.
‘ట్రంప్ 25 శాతం సుంకాలు విధింపు తీవ్రమైన విషయం. 25 శాతం భారత గూడ్స్‌పై విధిస్తూ తీసుకున్న నిర్ణయం మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. రష్యా నుండి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తున్నందుకు సుంకం విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. అది 35 నుంచ 45 శాతం పెరగవచ్చు. 100 శాతం జరిమానా గురించి చర్చ జరుగుతోంది. ఇది అమెరికాతో భారత వాణిజ్యాన్ని నాశనం చేస్తుంది. అమెరికాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో అది తగ్గే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అలా కాకపోతే మన ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అమెరికా అనేది మనకు చాలా పెద్ద మార్కెట్’ అని శశిథరూర్ పేర్కొన్నారు.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తూ బుధవారం(జూలై 30) ఓ ప్రకటన విడుదల చేశారు.
అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్‌పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం ఎంత న్నది పేర్కొనలేదు. ఈ నిర్ణయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు.
‘భారత్ మా మిత్ర దేశమే. కానీ వర్తక, వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంతో అంతా సజావుగా లేదు. అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ఆ దేశంతో మేం భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు’’అని రాసుకొచ్చారు. భారత్‌తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని గుర్తు చేశారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్‌లో జనహననం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో అందుకు పాల్పడుతున్న రష్యాతో భారత్ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.