‘యుద్ధం ఆపింది ఆయనే’.. పాక్‌ సైన్యాధ్యక్షునికి ట్రంప్‌ కితాబు | President Donald Trump Hosts Pakistan Army Chief Asim Munir | Sakshi
Sakshi News home page

‘యుద్ధం ఆపింది ఆయనే’.. పాక్‌ సైన్యాధ్యక్షునికి ట్రంప్‌ కితాబు

Jun 19 2025 9:28 AM | Updated on Jun 19 2025 10:12 AM

President Donald Trump Hosts Pakistan Army Chief Asim Munir

న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇదే సమయంలో పాక్‌ సైన్యాధ్యక్షుడు అసీమ్‌ మునీర్‌ను తమ దేశానికి అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానించడం మరిన్ని చర్చలకు దారితీసింది. మునీర్‌ను విందుకు పిలిచిన ట్రంప్‌.. ఆయనను అమెరికాకు ఆహ్వానించడం వెనుక గల కారణాన్ని కూడా వివరించారు.

అసిమ్ మునీర్‌తో భేటీ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ భారత్‌- పాక్‌ మధ్య వివాదం మరింత ముదరకుండా నిరోధించడంలో  మునీర్‌ పాత్రను  ప్రశంసించారు. వైట్ హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలో ‘నేను ఆయనను ఇక్కడకు  ఆహ్వానించడానికి గల కారణం ఏమంటే.. ఆయన యుద్ధంలోకి దిగకుండా, దానిని ముగించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

పాకిస్తాన్ జాతీయ భద్రతా విధానాలపై ఆధిపత్యం కలిగిన అసీమ్‌ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు మొదటిసారిగా ఆతిథ్యం ఇచ్చారు. పాకిస్తాన్ సీనియర్ పౌర అధికారుల సహాయం లేకుండా ఆయన ఈ విందులో పాల్గొనడం విశేషం. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా యుద్ధాన్ని ముగించినందుకు ట్రంప్‌  భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రశంసించారు. ‘ఇద్దరు  తెలివైన వ్యక్తులు యుద్ధంలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు. లేదంటే ఇది అణు యుద్ధానికి దారితీసేదని అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు.

ట్రంప్  మీడియాతో  మాట్లాడుతూ మునీర్‌ను కలవడం తనకు గౌరవప్రదంగా ఉందని, ఇద్దరం ఇరాన్ గురించి చర్చించామన్నారు. పాకిస్తాన్‌కు ఇరాన్ గురించి బాగా తెలుసన్నారు. అలా అని వారు ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలలో లేరని అర్థం కాదని అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులను పాకిస్తాన్ ఖండించింది, ఈ రకమైన దాడులు  అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని పాక్‌ పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఉద్రిక్తతల వేళ.. ఇరాన్‌ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు 

Advertisement
 
Advertisement
Advertisement