
న్యూఢిల్లీ: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ నుంచి అర్మేనియాకుతరలించిన 110 విద్యార్థులు గురువారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. అర్మేనియా నుంచి ప్రత్యేక విమానంలో వారిని భారత్‌కు తీసుకొచ్చారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ కావడంతో వారికోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ విద్యార్థుల్లో జమ్మూకశీ్మర్ నుంచే 90 మంది విద్యార్థులున్నారు.
‘నా కుటుంబాన్ని కలవగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేను. ఇరాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యుద్ధం మంచిది కాదు. మానవత్వాన్ని చంపుతుంది’అని ఇరాన్ నుంచి వచ్చిన విద్యార్థి అమాన్ అజార్ అన్నారు. కాగా, ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థుల కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ‘నా కొడుకు ఇరాన్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. నా కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వారి కృషికి ధన్యవాదాలు’అని రాజస్థాన్‌లోని కోట నుంచి వచ్చిన ఓ విద్యార్థి తండ్రి తెలిపారు.
ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య వివాదం తీవ్రమవుతున్న తరుణంలో, భారత ప్రభుత్వం తన పౌరులకు, ముఖ్యంగా విద్యార్థులకు భద్రత కల్పించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత్ అభ్యర్థన మేరకు ఇరాన్ భూ సరిహద్దుల గుండా విద్యార్థులు సురక్షితంగా అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల గుండా బయటకు వెళ్లాలని సూచించింది. కాగా, ప్రస్తుతం ఇరాన్‌లో 4వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
ఇది కూడా చదవండి: ఇరాన్‌పై దాడి ప్లాన్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?